- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భట్టి విక్రమార్కకు హరీష్ రావు హెచ్చరిక
భట్టి విక్రమార్కకు హరీష్ రావు హెచ్చరిక

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్టీపీసీ రూ.4.12కే యూనిట్ ఇస్తామన్నా.. కమీషన్ల కక్కుర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై రూ.82 వేల కోట్ల భారం మోపుతున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 30 శాతం కమీషన్లు తీసుకోవడం రాకనే తాను అన్ ఫిట్ అయ్యానని.. భట్టి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక రూ.50 వేల కోట్ల స్కాం ఉందని ఇప్పటికే బీఆర్ఎస్ బయటపెట్టిందని.. అయితే ఈ విషయంపై మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ప్రెస్‌మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారని.. తమ స్థాయిని దించుకొని విమర్శలు చేశారని అన్నారు. తాను అన్‌ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని భట్టి అన్నారని.. తాను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు మీలాగా 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకోవడం రాలేదని.. అందుకే అందులో అన్‌ఫిట్ అయ్యానని ఎద్దేవా చేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఏ రోజు కూడా సెక్రటేరియట్ లోపలికి వచ్చి ఆర్థిక శాఖ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసింది లేదన్నారు. మన ఊరు-మన బడి బిల్లులు ఇవ్వాలని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ఇంతకుముందు ఎప్పుడైనా ధర్నా చేశారా? అని ప్రశ్నించారు. సర్పంచులు, చిన్నచిన్న కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పదుల సార్లు ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసి అరెస్ట్ అయిన చరిత్ర ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నదా అని అన్నారు. ఫ్రస్ట్రేషన్‌లో నోరు జారితే మొదటికే మోసం వస్తుందని సూచించారు. సమాధానం ఉంటే, తెలిస్తే చెప్పండి, లేదంటే మౌనంగా ఉండాలని పేర్కొన్నారు.
స్కాంపై సమాధానం ఏదీ..?
పవర్ హాలిడే ఇచ్చిన కాంగ్రెస్ అన్ ఫిటా? లేదంటే నాణ్యమైన కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ అన్ ఫిటా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తాము స్కాం గురించి మాట్లాడుతుంటే, దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. రామగుండం, మక్తల్, పాల్వంచలో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తామని కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు చెప్పారని.. తాము ప్రశ్నించే సరికి మక్తల్‌లో పెట్టడం లేదని రెండు రోజుల్లోనే మాట మార్చారని పేర్కొన్నారు. ఇంకా టెండర్లు పిలువలేదు, పనులే మొదలు కాలేదు, రూ.50 వేల కోట్ల అవినీతి అని ఎలా అంటారని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారని.. మరి కాళేశ్వరంలో రూ.84 వేల కోట్లు ఖర్చు కాకముందే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఇదే మంత్రులు, నాయకులు తమను ఎలా తప్పుపట్టారు? అని ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకుండానే, ఎలాంటి అప్పు చేయకుండానే, వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండానే.. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంటు ఇస్తుంటే, మళ్లీ అప్పులు, పెట్టుబడులు, ధరలు ఎక్కువ పెట్టి కరెంటు కొనడం ఎందుకని అడిగితే ఇంతవరకూ చెప్పడం లేదని అన్నారు.
థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న తప్పుతో, రాష్ట్ర ప్రజలు మరో 25 సంవత్సరాల వరకు ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు తెలంగాణకు 4 వేల మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని.. దాని ప్రకారం ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల ప్లాంట్ నిర్మించిందని.. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే తమ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుందన్నారు. మరో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని.. దయచేసి పీపీఏ చేసుకోండని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా కాదా? అని నిలదీశారు. ఒక్కసారి కాదని.. మూడుసార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసిందని.. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ సీఎండీ స్వయంగా హైదరాబాద్ వచ్చి సీఎం, డిప్యూటీ సీఎంను కలిసింది నిజమా, అబద్ధమా చెప్పాలని నిలదీశారు. తెలంగాణ కోసమే ప్లాంట్ నిర్మించామని, 2,400 మెగావాట్ల కరెంటును తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని.. కానీ వీళ్లు 2,400 మెగావాట్లలో 800 మెగావాట్లు చాలని.. మిగిలిన 1,600 మెగావాట్లు అవసరం లేదని చెప్పారని ఆరోపించారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తాము గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తామని.. థర్మల్ పవర్ తగ్గిస్తామని చెప్పారని.. అసెంబ్లీలో థర్మల్ విద్యుత్‌ను తగ్గిస్తామని కమీషన్ల కోసం ఇప్పుడు ప్లాంట్లను నిర్మించడానికి రెడీ అవుతున్నారని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ, కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్‌లో 2030 కల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేస్తామని చెప్పారని.. మరి ఇప్పుడు ఆ గ్రీన్ ఎనర్జీ నినాదం ఇచ్చిన వాళ్లే మళ్లీ థర్మల్ ఎనర్జీకి ఎందుకు మొగ్గు చూపుతున్నారని ప్రశ్నించారు.
ఒక్క మెగావాట్‌కు రూ.13 కోట్ల ఖర్చు
జెన్కో డీపీఆర్ ప్రకారం రామగుండం పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.10,800 కోట్లు ఖర్చు అవుతుందని.. ఒక్క మెగావాటుకు రూ.13 కోట్ల 62 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపినట్లు హరీశ్‌రావు చెప్పారు. నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.15 నుంచి 16 కోట్లకు చేరుతుందన్నారు. ఆ ప్లాంట్‌లో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రూ.7.70 పైసలు అవుతుందని జెన్కో డీపీఆర్ స్పష్టం చేసిందన్నారు. దీనిపై ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా మూడు పవర్ ప్లాంట్లకు రూ.45 వేల కోట్లు కావాల్సి వస్తుందన్నారు. ‘కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి’ లెక్క ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ రెడీగా ఉందని.. వాళ్లు ఇచ్చే కరెంటుకు యూనిట్‌కు నాలుగు రూపాయల 12 పైసలు మాత్రమే అవుతుందని చెప్పారు. ఒక వైపు పైసలు లేవని.. అప్పుల కోసం పోతే చెప్పులు దొంగతనానికి వచ్చినట్టు చూస్తున్నారని రేవంత్‌రెడ్డి చెప్తున్నారని.. పెన్షన్లకు దిక్కులేదు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు, మరి ఈ ప్లాంట్లు కట్టడానికి అప్పులు ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించారు.
కమీషన్లు రావనే ఎన్టీపీసీ కరెంట్‌ను కొనడం లేదా అని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఒకే దగ్గర ఉంటే సమస్య అవుతుందని.. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే ఫ్లై యాష్ చాలా పెద్ద సమస్య అవుతుందని చెప్పారు. ఆ ఫ్లై యాష్‌ని ఎవరూ తీసుకోకపోతే పర్యావరణానికి చాలా ముప్పు ఉంటుందని హెచ్చరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను మూసేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగిరారని.. ఇప్పుడేమో కొత్త పవర్ ప్లాంట్‌కు చప్పట్లు కొడుతున్నారని ఆరోపించారు. అలాగే.. విద్యుత్ శాఖను ఆంధ్రా అధికారులతో నింపేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్నదా అన్న అనుమానం కలుగుతున్నదని.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులను అత్యంత కీలకమైన విభాగాల్లో వరుసగా నియమించారని తెలిపారు. ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులను అవహేళన చేసిన పచ్చి సమైక్యవాది కుమార్ రాజాను తీసుకొచ్చి విద్యుత్ ఉద్యోగుల డైరెక్టర్‌గా జెన్కోలో పెట్టారని.. ఇది ఉద్యమకారులను, ఉద్యోగులను అవమాన పరిచినట్లు కాదా? అని ప్రశ్నించారు. సీఎం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి పర్యటనలు చేస్తున్నారని.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్ర పోతున్నదా అని ప్రశ్నించారు. తక్షణమే ఎన్నికల సంఘం రివ్యూ చేసి, పోలీసులకు ఆదేశాలిచ్చి కేసు నమోదు చేయాలన్నారు.






