తొలిసారి CM రేవంత్ నిర్ణయాన్ని సమర్దించిన హరీష్ రావు.. అమ్మవారి కృప అంటూ ట్వీట్

by Gantepaka Srikanth |

కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

తొలిసారి CM రేవంత్ నిర్ణయాన్ని సమర్దించిన హరీష్ రావు.. అమ్మవారి కృప అంటూ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘కోకాపేటలో శారదాపీఠం భూములను జలమండలికి కేటాయించిన నిర్ణయాన్ని రద్దు చేయడం రాజ శ్యామలా దేవి అమ్మవారి కృపతో జరిగిన ధర్మ విజయం. ఇది భక్తుల విజయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి ప్రసాదించిన రాజ్య శ్యామల అమ్మవారికి నమస్సులు. ఎలాంటి స్పష్టమైన ప్రజా ప్రయోజన ప్రతిపాదిక లేకుండా, పర్యావరణ నియమ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ, నామినేషన్ పద్ధతిలో మీ అల్లుడి అనుయాయులకి HMDA ద్వారా కేటాయించిన 17 ఎకరాల భూమి సంగతి ఏమిటి? అని ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నించారు. ఆ భూమిలో కొనసాగుతున్న క్రషర్ యూనిట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకునే రేవంత్ ప్రభుత్వం చర్యలపై బీఆర్ఎస్ గట్టిగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని ప్రకటన చేశారు.

అంతకుముందు హైదరాబాద్ కోకాపేట‌లో శార‌దా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఠం భూములు జ‌ల మండ‌లికి కేటాయించిన నేప‌థ్యంలో అక్క‌డ సాగుతున్న నిర్మాణ ప‌నుల విష‌యాల‌ను పీఠం ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వ‌ర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని తెలుసుకున్నారు. పీఠం భూముల‌ను జ‌ల‌మండ‌లికి కేటాయించే స‌మ‌యంలో నిర్మాణాల స్థితిని తెలియ‌జేయ‌క‌పోవ‌డంపై ముఖ్య‌మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌ల మండ‌లికి కేటాయింపులు ర‌ద్దు చేసి శారదా పీఠానికే ఆ భూములు కొన‌సాగించాల‌ని ఆదేశించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌ బాబుని క‌లిసి నిర్మాణాలు, ఇత‌ర ప‌రిస్థితుల‌ను వివ‌రించాల‌ని ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి, పీఠం ప్ర‌తినిధుల‌కు సూచించారు.

Next Story