- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులతో ధర్నా విరమింపజేయించిన హరీష్ రావు
వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా గతకొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న రైతుల దీక్షను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విరమింపజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా గతకొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న రైతుల దీక్షను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విరమింపజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇది రాజకీయాల కోసం చేస్తున్న దీక్ష కాదని, రైతుల భూములను కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటమని ఆయన స్పష్టం చేశారు. "పాలమూరును గతంలో ఒకరు దత్తత అన్నాడు.. మరొకాయన వలసల జిల్లాగా మార్చాడు" అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 25 రిజర్వాయర్లు కడితే, బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9 ఏళ్లలోనే 65 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించిందని గుర్తుచేశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో మేజర్ పార్ట్ పనులను బీఆర్ఎస్ పూర్తి చేస్తే, మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేయడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. గత మూడు సీజన్లుగా నీటిని వాడుకోలేకపోవడం వల్ల 50 టీఎంసీలను నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
రిజర్వాయర్ నిర్మాణంపై అభ్యంతరం..
గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ అవసరం లేదని తాము ఆనాడే చెప్పామని హరీష్ రావు తెలిపారు. "ఏదుల నుండి నేరుగా నీళ్లు పారే అవకాశం ఉంది. అలాంటప్పుడు కొత్త రిజర్వాయర్ ఎందుకు? కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తెస్తోంది. రైతుల భూములను బలిపెట్టి కట్టే ఈ ప్రాజెక్టును మేం అడ్డుకుంటాం." అని హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు. వనపర్తి జిల్లాలో ఏ ఊరికైనా వెళ్దాం.. రుణమాఫీ 100 శాతం పూర్తయిందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను. లేదంటే నువ్వు (ప్రభుత్వం/స్థానిక నేతలు) సిద్ధమా? అని ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సంతకం చేసి, 28 నెలలు దాటినా ఇంకా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కేరళలో అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. నాలుగుసార్లు రైతుబంధును ఎగ్గొట్టి, కేవలం ఒక్కసారి మాత్రమే పూర్తిస్థాయిలో ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో వలసపోయిన వారు వెనక్కి వచ్చారని, పాలమూరు పచ్చని రంగు వేసుకుందని గుర్తుచేశారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భూములను కాపాడతామని రైతులకు హరీష్ రావు భరోసా ఇచ్చారు.






