- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెలిమెట్రీల ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
దిల్‍సుఖ్‍నగర్, అశోక్‌నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడం సరికాదని.. ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమనకాండ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

టెలిమెట్రీల ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
- రూ.4.18 కోట్ల నిధులను కేఆర్ఎంబీ దారి మళ్లిస్తుంటే చోద్యం
- ఉద్దేశపూర్వకంగానే పరికరాల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం
- ఏపీ దుర్మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గం
- మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
దిశ, తెలంగాణ బ్యూరో: టెలిమెట్రీల ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో ధ్వజమెత్తారు. కృష్ణా జలాల వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18 కోట్ల నిధులను కేఆర్ఎంబీ దారి మళ్లిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ, కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమని తెలిపారు. జూన్ 2016లో నిర్వహించిన కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో ఇంకా 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నదని.. ఇప్పటివరకు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కేఆర్ఎంబీ నిర్ణయం ధిక్కరిస్తూ టెలిమెట్రీ ఏర్పాటు కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఎందుకు ఏపీ మీద ఒత్తిడి చేయకుండా మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేసుకోవడమే తప్ప రెండేళ్లలో కేంద్రం చేసింది ఏం లేదని తెలిపారు. పోలవరం-నల్లమలసాగర్ విషయంలో మొద్దు నిద్ర ప్రదర్శించినట్లుగానే, టెలిమెట్రీల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు. రూ. 4.18 కోట్ల ప్రభుత్వ నిధులను వెంటనే రికవరీ చేసి, టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
నిరుద్యోగులపై సర్కారు దమనకాండ
దిల్‍సుఖ్‍నగర్, అశోక్‌నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడం సరికాదని.. ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమనకాండ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి, పొర్లుదండాలు పెట్టి, నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని తెలిపారు. వారి ఉద్యోగ కాంక్షను ఆసరా చేసుకొని, వారిని కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చుకొని ఇంటింటికీ తిప్పి ప్రచారానికి వాడుకున్నారని ఆరోపించారు. అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కుపాదం మోపి తొక్కుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నదని.. పోలీసు రాజ్యం నడుస్తున్నదని పేర్కొన్నారు. నిరుద్యోగులకు లాఠీచార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారని పేర్కొన్నారు. దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలను ఆపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు. నిరుద్యోగులను లాకప్ హింసకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






