- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో ఎవరెవరిని కలిశారో హరీశ్ రావు బయటపెట్టాలి.. మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ నుంచి తప్పించుకునేందుకే మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీకి పరుగెత్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ నుంచి తప్పించుకునేందుకే మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీకి పరుగెత్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జడ్జిమెంట్ ప్రకటించకముందే న్యాయవాదులను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆరోపించారు. సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన పిల్లర్లను పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. బీజేపీని అడ్డుపెట్టుకుని కేసుల నుంచి బయటపడతామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, కాళేశ్వరం దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.
లక్షన్నర కోట్లకు అంచనాల పెంపు
గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు 1975లో అప్పటి సీఎం జలగం వెంగళరావు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 38,063 కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి రూ. 11,700 కోట్లు ఖర్చు చేశారన్నారు. అయితే, ప్రాణహిత-చేవెళ్ల ద్వారా ఆర్థిక, రాజకీయ ప్రయోజనం లేదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో దానికి పేరు, ఊరు మార్చేశారని విమర్శించారు. అంచనాలను ఏకంగా రూ. లక్షా 50 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. 2016లో మొదలుపెట్టిన మేడిగడ్డను అద్భుతమని భ్రమలు కల్పించి 2018లో రాజకీయ లబ్ధి పొందారని, తీరా 2023లో బ్యారేజీ కుప్పకూలడంతో ఎన్నికల కోసం ఆ నిజాలను దాచిపెట్టాలని చూసినా ప్రకృతి బయటపెట్టిందని ఎద్దేవా చేశారు.
కేంద్రం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం
ప్రాజెక్టులో సమస్యలు రాగానే 2023 నవంబర్ 1న అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (NDSA) ప్రాథమిక నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం దోపిడీపై పీసీ ఘోష్ కమిటీ సంపూర్ణ నివేదిక ఇచ్చిందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం పంపిందని తెలిపారు. కేసీఆర్, హరీశ్ రావులను జైల్లో వేయాలని, సీబీఐకి కేసు అప్పగించాలని గతంలో డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రం పదే పదే లేఖలు రాస్తున్నా సీబీఐ స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు శ్రీపాద ఎల్లంపల్లే ప్రాణవాయువు అని, హరీశ్ రావు నిక్కర్ వేసుకోకముందే ఆ ప్రాజెక్టు ఉందని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి నీటితోనే రాష్ట్రంలో అత్యధిక పంటలు పండించారని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తారని ముందే తెలిసి, బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. మీడియా బయటపెట్టినా వారి నుంచి ఎలాంటి ప్రకటన లేదని, ఆ రహస్య పర్యటన వెనుక ఉన్న మతలబు ఏంటో, ఎవరెవరిని కలిశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
వృథాగా వదలం.. రిపేర్లు చేసి తీరుతాం
లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఊరికే వదిలిపెట్టబోమని, దానికి మరమ్మతులు చేసి ప్రజలకు నీరు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి నెల రోజుల క్రితమే అధికారులతో, సాంకేతిక నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అయితే, ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా నేడు రాజకీయ సభలు పెట్టుకున్నారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వారికి అనుమతులు ఇచ్చిందని సీఎం పేర్కొన్నారు. అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళతామని, తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించి తీరుతామని ఆయన తేల్చి చెప్పారు.






