హ‌రీష్ రావు ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి : మంత్రి సీతక్క మండిపాటు

by Muthe.Rajitha |

మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ఎమ్మెల్యే హరీష్​రావు బహిరంగ లేఖలు రాయడం మాని, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

హ‌రీష్ రావు ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి : మంత్రి సీతక్క మండిపాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ఎమ్మెల్యే హరీష్​రావు బహిరంగ లేఖలు రాయడం మాని, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆర్ధిక మంత్రి హరీష్​రావు ఉన్న సమయంలోనే మినీ అంగ‌న్వాడీలకు అన్యాయం చేశారని విమర్శించారు. ఆయన ఇచ్చిన ఓట్ల జీవోలతో అంగ‌న్వాడీల‌కు ఒరిగిందేమి లేదని దుయ్యబట్టారు. మొక్కుబ‌డి జీవోల చిక్కుముడులు చేధించి ప‌క‌డ్భందిగా అమ‌లు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. అంగన్​వాడీ టీచ‌ర్ల జీతాల‌పై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రాసిన బహిరంగ లేఖపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా మినీ అంగన్వాడీ టీచర్ల పట్ల బాధ్యత ఉంటే.. ప‌దేళ్లలో వారిని మెయిన్ అంగన్వాడీలుగా ఎందుకు ప‌దోన్నతులు క‌ల్పించ లేద‌ని హ‌రీష్ రావును ప్రశ్నించారు.

ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎన్నిక‌ల ముందు మొక్కుబడి జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్న చ‌రిత్ర మీద‌ని ఆమె మండిప‌డ్డారు. ఆర్దిక మంత్రిగా ఉండి మినీ అంగ‌న్వాడీల‌కు ప‌దోన్నతులు రాకుండా హ‌రీష్ రావే అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు మీకు ప‌ట్టని మినీ అంగన్వాడీల స‌మ‌స్యలు..అధికారం పోగానే గుర్తుకు వ‌చ్చాయా అని ప్రశ్నించారు. "ఓట్ల కోసమే అప్పట్లో జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ జీవోలు ఓట్ల జీవోలే, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా జారీ చేసిన జీవోలు పనికి రాకుండా పోయాయన్నారు. ఇప్పుడు తాము జీవోల‌ను చట్టబద్ధంగా, పకడ్బందీగా అమలు చేసి చూపిస్తున్నాం" అని మంత్రి సీతక్క మండిపడ్డారు. మీరు అంగ‌న్వాడీల‌ను మోసం చేస్తే...తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే చట్టబద్ధంగా, ఆర్థిక శాఖ అనుమతులతో 3438 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించామ‌ని మంత్రి సీతక్క గుర్తు చేశారు.

ఎన్నో చిక్కుముడుల‌ని చేధించి, భ‌విష్యత్తులో ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన అడ్డంకులు త‌లెత్తకుండా..ఏప్రిల్ 2025లోనే ఈ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేసి, ఈ నెల నుంచే మెయిన్ అంగన్ వాడీల తరహాలోనే మిని అంగ‌న్వాడీల‌కు జీతాలు చెల్లిస్తున్నామ‌న్నారు. మిన్ సెంట‌ర్లను మెయిన్ సెంట‌ర్లుగా అప్ గ్రేడ్ చేసి, టీచ‌ర్లుకు తోడుగా హెల్పర్లను నియ‌మిస్తున్నట్లు తెలిపారు. "పదేళ్లు మీ పాలన వల్ల బాధపడ్డ ప్రజ‌ల‌కు హ‌రీష్ రావు బ‌హిరంగ క్షమాప‌ణ చేబితే బాగుంటుంద‌ని మంత్రి సీత‌క్క పేర్కొన్నారు. బహిరంగ లేఖ రాయడం కన్నా..అంతరాత్మను ప్రశ్నించుకోవాల‌ని సూచించారు. అంగన్వాడీ వ్యవ‌స్థను బలోపేతం చేస్తూ, అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల అభ్యున్నతికి పని చేస్తున్నామన్నారు. పదేళ్ల మీ దుష్పరి పాలన పాపం ఒక్కరోజులో పోదని, ద‌శాబ్ద కాల‌పు సమస్యల‌ను ఒక్కోక్కటిగా ప‌రిష్కరిస్తున్నామ‌ని ఈసందర్భంగా మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Next Story