- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణిని రాజకీయ కమీషన్లకు అడ్డాగా మార్చితే చూస్తూ ఊరుకోం: హరీశ్ రావు
సింగరేణి ఓబీ టెండర్లలో కాంగ్రెస్ సిండికేట్ గుట్టు రట్టయిందని హరీశ్ రావు విమర్శించారు. శ్రీరాంపూర్ టెండర్ పరిణామాలను ఆయన ఉదహరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి ఓవర్ బర్డెన్ (ఓబి) టెండర్లలో రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న దోపిడీని ఆధారాలతో సహా బట్టబయలు చేసి.. 'సైట్ విజిట్ సర్టిఫికెట్' ముసుగులో కాంట్రాక్టర్ల రింగ్ ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణిని ఎలా లూటీ చేస్తున్నారో బీఆర్ఎస్ పోరాటంతో కాంగ్రెస్ గుట్టు రట్టయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ అడుగడుగునా నిలదీయడంతోనే శ్రీరాంపూర్ SRP OC-II టెండర్ ఫైనాన్షియల్ బిడ్ల అసలు బాగోతం బయటపడిందని టెక్నికల్ బిడ్ అయిన తర్వాత కూడా ఫైనాన్షియల్ బిడ్ ను దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏడుసార్లు ఎందుకు వాయిదా వేశారని నిలదీసి సింగరేణి కార్మిక లోకాన్ని బీఆర్ఎస్ పార్టీ చైతన్యపరిచిందన్నారు. ఆ నిరంతర ఒత్తిడికి తలొగ్గి, ఎట్టకేలకు సిండికేట్ ప్రమేయం లేకుండా పారదర్శకంగా బిడ్లు తెరిచేసరికి.. ఈ టెండర్ ఏకంగా మైనస్ 12 శాతం (–12%) కు క్లోజ్ అయిందన్నారు. ఈ మేరకు హరీశ్ రావు ఆదివారం ఓ ప్రటన విడుదల చేశారు.
సీఎం బామ్మర్ది కనుసన్నల్లో:
కొత్త నిబంధనలు తెచ్చాక సింగరేణిలో నమోదైన తొలి నెగెటివ్ బిడ్ ఇదేనని ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి సిండికేట్‍ను బద్దలు కొడితే అసలైన పోటీ ఎలా ఉంటుందో, ధరలు ఎలా దిగి వస్తాయో ఈ ఒక్క టెండర్ నిరూపించిందన్నారు. గతంలో సింగరేణిలో ఓబి టెండర్లు పారదర్శకంగా ఆన్‌లైన్‌లో జరిగేవని అప్పట్లో –7% నుంచి –20% తక్కువకే పనులు పూర్తయ్యి, సంస్థకు వందలాది కోట్లు ఆదా అయ్యేవన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో ఈ దోపిడీకి స్కెచ్ గీశారని ఆరోపించారు.
అయిన వారికే టెండర్లు దక్కేలా:
ఆన్‌లైన్ టెండర్ల పారదర్శకతను దెబ్బతీయడానికే కావాలని 'సైట్ విజిట్ సర్టిఫికెట్' నిబంధన తెచ్చారన్నారు. టెండర్ వేయకముందే అధికారుల దగ్గర ఈ సర్టిఫికెట్ తీసుకోవాలనే నిబంధన పెట్టడం వెనుక ఉన్న కుట్ర ఏంటంటే.. ఎవరెవరు టెండర్ వేస్తున్నారో అధికార పార్టీ నేతలకు ముందుగానే తెలిసిపోతుందన్నారు. దాంతో వాళ్లని బెదిరించి పోటీ లేకుండా చేసి తమకు కావాల్సిన వారికే టెండర్లు దక్కేలా సిండికేట్ ఏర్పాటు చేయడానికి ఇది బ్రహ్మాస్త్రంగా మారిందన్నారు.
కమిషన్ల కక్కుర్తి:
ఆ భారం సామాన్యులపై పడుతోంది:
బొగ్గు ఉత్పత్తి తగ్గి సింగరేణికి ఆదాయం గండి పడుతోందని ఎక్కువ రేటుకు కరెంటు కొని జెన్‌కోకు నష్టం కలిగించి అంతిమంగా ఈ భారం అంతా విద్యుత్ చార్జీల రూపంలో సామాన్య ప్రజల నెత్తిన పడుతోందన్నారు. మరోవైపు బొగ్గు ఉత్పత్తి తగ్గి, సంస్థ లాభాలు పడిపోతుండటంతో.. బొగ్గు గని కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తూ ప్రతి ఏటా ఎంతో ఆశగా ఎదురుచూసే దసరా బోనస్ లాభాల వాటా శాతానికి కోత పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల వాటాలు, ముఖ్యమంత్రి బంధువుల కమిషన్ల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ సంపదను కాపాడే విధంగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
చూస్తూ ఊరుకోం:
సింగరేణి టెండర్లలో పూర్తి పారదర్శకత పాటించాలని అవినీతికి ఆస్కారం ఇస్తున్న సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన కాంట్రాక్టర్ల సిండికేట్ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థను రాజకీయ కమీషన్లకు అడ్డాగా మారిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శ్రీరాంపూర్ టెండర్లో వచ్చిన –12% బిడ్ కాంగ్రెస్ అసలు రంగును బయటపెట్టింది. ముఖ్యమంత్రి బావమరిది సిండికేట్ బద్దలైతే ప్రజాధనం ఎలా ఆదా అవుతుందో ఈ పరిణామంతో రుజువైందన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పోరాట విజయం. తెలంగాణ వనరులను కాపాడేది ఎవరో, కాంట్రాక్టర్ల కమీషన్లను కాపాడేది ఎవరో ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు.






