Harish Rao: ‘సన్‌ఫ్లవర్‌’ రైతు గోస పట్టదా? 75 రోజులైనా జమ కానీ డబ్బులు: హరీశ్‌రావు

by Ramesh Naini |

సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయింది.. సన్న వడ్ల బోనస్ పై సన్నాయి నొక్కులేనా.. అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

Harish Rao: ‘సన్‌ఫ్లవర్‌’ రైతు గోస పట్టదా? 75 రోజులైనా జమ కానీ డబ్బులు: హరీశ్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయింది.. సన్న వడ్ల (Bonus for fine grain) బోనస్ పై సన్నాయి నొక్కులేనా.. అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. యాసంగి లో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ.1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఇవాళ (శుక్రవారం) ఒక ప్రకటనలో విడుదల చేశారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పొద్దు తిరుగుడు ( సన్‌ఫ్లవర్) రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. సన్‌ఫ్లవర్ కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతోందని విమర్శించారు. ఒక సిద్దిపేట జిల్లాలోనే 50 శాతం రైతులకు డబ్బులు ఇవ్వలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సన్‌ఫ్లవర్ (sunflower farmers) రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని తెలిపారు.

వెంటనే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రూ. 1,116 కోట్ల సన్నాల బోనస్ డబ్బులతో పాటు సన్‌ఫ్లవర్ రైతులకు పంట కొనుగోలు డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను గోస పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, ప్రతీచోట రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన మీరు.. పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారని తెలిపారు. అడుగడుగునా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం బయటపడుతోందన్నారు. పంట పెట్టుబడి సహాయం అందించడంలో వైఫల్యం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కేటాయించడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం, ధాన్యం కొనుగోలు చేయడంలో వైఫల్యం, కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.

Next Story