- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ ఇప్పటికైనా డ్రామాలు ఆపండి.. ఢిల్లీలో కొట్లాడండి.. కలిసి రావడానికి సిద్ధం.. హరీశ్‌రావు
ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. గురువారం (High Court) హైకోర్టు కోర్టులో బీసీ రిజర్వేషన్ల విచారణ అనంతరం ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ జాతీయ నాయకులతో ఢిల్లీ వేదికగా కొట్లాట పెట్టండి అని సవాల్ చేశారు. కలిసి రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమే అని స్పష్టం చేశారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలు అయ్యాయని ఆరోపించారు.
22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన (Revanth Reddy) రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారు తప్ప, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారని ఆరోపించారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీశారని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి.. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడండి.. పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యూల్ 9 లో చేర్చండి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయండి.. ఢిల్లీ వేదికగా యుద్ధ భేరి మోగించండి.. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుంది... ఢిల్లీని నిలదీస్తుంది.. అని పేర్కొన్నారు.






