మీసేవలో రేషన్‌కార్డులు.. గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? హరీశ్‌రావు ఫైర్

by Ramesh Naini |

నూతన రేషన్ కార్డుల కోసం మీసేవ నుంచి దరఖాస్తు చేయాలని సివిల్ సప్లై అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మీసేవలో రేషన్‌కార్డులు.. గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? హరీశ్‌రావు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నూతన రేషన్ కార్డుల (New ration cards) కోసం మీసేవ (Mee Seva) నుంచి దరఖాస్తు చేయాలని సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) శనివారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు (CM Revanth Reddy) రేవంత్‌రెడ్డి? అని ప్రశ్నించారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు, కుల గణనలో వివరాలు తీసుకున్నారు, గ్రామ సభల పేరిట డ్రామా చేశారు, ఇప్పుడు మళ్లీ మీ సేవలో దరఖాస్తు అంటున్నారని మండిపడ్డారు.

పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీ నేనా? అని నిలదీశారు. ప్రజా పాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారని, జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే ప్రభుత్వ దృష్టి ఉందన్నారు. దరఖాస్తుల పేరిట కాలం వెళ్లదీయడం మానేసి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయండని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి, నిరుపేదలకు, రైతులకు బాసటగా నిలవాలని హితువు పలికారు.

Next Story