- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని దిక్కుమాలిన దుస్థితి
కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. నెలనెలా నిధులు లేక గ్రామాలు మురికి కూపాలుగా మారాయని.. కొన్నిచోట్ల

ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని దిక్కుమాలిన దుస్థితి
- రాష్ట్రాన్ని దిగజార్చిన సీఎం రేవంత్‌రెడ్డి
- కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా?
- మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఎట్లుండే తెలంగాణ.. ఎట్ల అయ్యింది? నువ్వు చెప్పిన మార్పు ఇదేనా రేవంత్ రెడ్డి? చెత్త తరలించే ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని దిక్కుమాలిన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చినవు’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో విమర్శించారు. పెట్రోల్ పంపు వాళ్లు డీజిల్ ఉద్దెరకు పోయడం లేదని, అప్పు పుడుతలేదని, సెక్రెటరీలు ట్రాక్టర్ తాళాలను అధికారులకు అప్పగించే పరిస్థితికి తెచ్చారని పేర్కొన్నారు. ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకుంటే గ్రామ పాలన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సీఎం చేతగానితనం పంచాయతీ అధికారులకు, పారిశుధ్య సిబ్బందికి శాపంగా మారుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. నెలనెలా నిధులు లేక గ్రామాలు మురికి కూపాలుగా మారాయని.. కొన్నిచోట్ల ట్రాక్టర్లను అధికారులు మూలకు పెట్టారని.. మరికొన్ని చోట్ల వారం, మూడు రోజులకు ఒకసారి నడుపుతున్నారని పేర్కొన్నారు.
కాలిపోయిన వీధి దీపాలు మార్చడానికి నిధులు లేక గ్రామాలు చీకటిమయం అవుతున్నాయని ఆరోపించారు. ఆర్థిక భారాన్ని మోయలేక పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవులు పెట్టే దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు రెండు నెలల జీతాలు అందక నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నెలనెలా రూ.275 కోట్ల జీపీ నిధులు విడుదల చేశామని వెల్లడించారు. పాలన గాలికి వదిలేసి ముగ్గురు మంత్రులకు పోర్టు ఫోలియోలు కేటాయించేందుకు మూడురోజులుగా ఢిల్లీలో తీష్ట వేశారని విమర్శించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం కట్టి జీవితాలను మార్చారు
తెలంగాణ రాష్ట్ర హోదా సాధించడం నుండి కాళేశ్వరం వంటి పరివర్తన కలిగించే ప్రాజెక్టును అందించి ప్రజల జీవితాలను మార్చారని, ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇతరులు అధికారాన్ని వెంబడిస్తే, ఆయన జీవితాలను మార్చారని తెలిపారు. కాంగ్రెస్ కుట్రలు.. కమిషన్ విచారణ ఆయన వారసత్వాన్ని తుడిచిపెట్టలేవని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగాలు సాటిలేనివని తెలిపారు.






