BRS: ఎర్రవల్లి ఫామ్ హౌస్‍కు హరీశ్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అదే సీన్ రిపీట్ కాబోతోందా?

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న అనంతరం ఇవాళ హరీశ్ రావు కేసీఆర్‍ తో భేటీ అయ్యారు.

BRS: ఎర్రవల్లి ఫామ్ హౌస్‍కు హరీశ్ రావు..  ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అదే సీన్ రిపీట్ కాబోతోందా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‍తో (KCR) ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) భేటీ అయ్యారు. ఇవాళ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‍‍కు వెళ్లిన హరీశ్ రావు.. అక్కడ గులాబీ బాస్‍తో సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) నిన్న సిట్ విచారణకు హరీశ్ రావు హాజరైన నేపథ్యంలో ఈ విచారణ జరిగిన మరుసటి రోజే కేసీఆర్‍తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు తాను ఇచ్చిన సమధానాలపై హరీశ్ రావు కేసీఆర్‍తో చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై హరీశ్ రావుకు గూలాబీ బాస్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

సేమ్ సీన్ రిపీట్ కాబోతోందా?:

ఫోన్ ట్యాపింగ్‍లో జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ రేపుతున్నాయి. నిన్న హరీశ్ రావును దాదాపు 7 గంటలకు పైగా సిట్ ప్రశ్నించింది. అయితే హరీశ్ రావును ప్రశ్నించడంతో ఇక సిట్ తదుపరి టార్గెట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న వారిలో ఎక్కువ మంది ‘పెద్దాయన’ ఆదేశాల మేరకే ఇందంతా చేశామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పెద్దాయన కేసీఆరేనని ఈ కేసులో నెక్స్ట్ నోటీసులు కేసీఆర్‍కే అనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణను ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. నాడు జరిగిన పరిణామాలే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ జరుగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సమయంలో హరీశ్ రావును ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‍లో కేసీఆర్ ను కలిశారు. ఆ సమయంలో ఏయే ప్రశ్నలు అడిగారు వాటికి తాను ఇచ్చిన సమాధానాలేంటి అనే అంశంపై ఇరువురు చర్చించినట్లు ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్‍ను హరీశ్ రావు కలిసిన తర్వాత కొంత కాలానికే పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగియగానే హరీశ్ రావు కేసీఆర్ తో భేటీ కావడంతో నాడు జరిగిందే ఇప్పుడు మళ్లీ జరగబోతోందా? నెక్స్ట్ కేసీఆర్ కు నోటీసులు రాబోతున్నాయా అనేది ఉత్కంఠగా మారింది.

Next Story