చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నవా?.. CM రేవంత్‌పై హరీష్ రావు సీరియస్

by Gantepaka Srikanth |

రేవంత్‌రెడ్డి నాడు ఉద్యమ ద్రోహిలా మారితే.. నేడు జలద్రోహిలా తయారయ్యారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నవా?.. CM రేవంత్‌పై హరీష్ రావు సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి నాడు ఉద్యమ ద్రోహిలా మారితే.. నేడు జలద్రోహిలా తయారయ్యారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గోదావరి-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు జారీ చేసినా స్పందించడం లేదని అన్నారు. గోదావరి-బనకచర్లతో జల దోపిడీకి ప్రయత్నం చేసిన ఏపీ నష్టాన్ని తగ్గించడం కోసం బనకచర్ల నుంచి నల్లమలసాగర్‌కు మార్చుకుందని ఆరోపించారు. అది బనకచర్ల అయినా నల్లమలసాగర్ అయినా జరిగేది తెలంగాణ జల దోపిడీనే అని వెల్లడించారు. నల్లమలసాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే.. పాత్రధారి రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. కత్తి చంద్రబాబుది అయినా పొడిచేవాడు రేవంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. రేవంత్ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నరా అని ప్రశ్నించారు.

బనకచర్లపై తాము పోరాడుతున్న సమయంలోనే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణతో మీటింగ్ పెట్టిందని చెప్పారు. ఆ సమావేశానికి పోను పోను అంటూనే సీఎం ఉరికారని.. అపెక్స్ మీటింగ్‌కు కాకుండా వేరే ఏ రకమైన సమావేశానికి హాజరు కావొద్దని తాము ఆనాడు గట్టిగా హెచ్చరించామని చెప్పారు. పోను అనుకుంటూనే పోయి కూసున్నరని.. పెట్టపెట్ట అనుకుంటనే సంతకం పెట్టారని ఆరోపించారు. తాము నిలదీస్తే, నిలబెట్టి కడిగేస్తే బనకచర్ల మీటింగ్ ఎజెండాలోనే లేదని, చర్చ జరిగే ప్రసక్తే లేదని డైలాగులు దంచారని తెలిపారు. తాము మీటింగ్ ఎజెండాను బట్టబయటు చేశామని.. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు సైతం బండారం బయట పెట్టారని పేర్కొన్నారు. బనకచర్లపై చర్చ జరిగిందని, ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసేందుకు కమిటీ ఏర్పాటు అయ్యిందని మీడియా ముఖంగా చెప్పారని అన్నారు. బనకచర్లను బంద్ పెడుతున్నమని పేరుకు ఏపీ ప్రకటించిందన్నారు.

ఇతర రాష్ట్రాలు అభ్యంతరం తెలిపినా..

పోలవరం నుంచి బనకచర్లలో కలపకుండా, పోలవరం నల్లమలసాగర్‌కు లింకు చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ఎందుకంటే.. గోదావరి నీళ్లు కృష్ణా ద్వారా తరలిస్తే గోదావరి అవార్డు ప్రకారం 45:21:14 తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుందని.. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ ఈ రూల్ వర్తిస్తుందని అన్నారు. ఈ విధంగా కూడా తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణాలో కలుపకుండానే, పెన్నా బేసిన్‌కు గోదావరి నీటిని తరలించే పెద్ద కుట్రకు తెరతీశారని ఆరోపించారు. నిజానికి పోలవరం-బనకచర్ల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాశాయని.. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం గోదావరి నీళ్లు తరలిస్తే.. మరుసటి రోజు నుంచి పైన నీళ్లు ఆపుతామన్నారని తెలిపారు. వరద జలాల మీద ప్రాజెక్టు కట్టేందుకు ఏపీకి అవకాశం ఇస్తే తామూ ప్రాజెక్టులు కట్టేందుకు డీపీఆర్‌లు పంపుతామని బలంగా చెప్పారని వెల్లడించారు. అలాగే.. కృష్ణాలో 74 టీఎంసీలు తమ వాటా నీళ్లు ఆపుకుంటామని, వరద ప్రాజెక్టులు కడుతామని, విదర్భకు నీళ్లు తీసుకుపోతామన్నారని తెలిపారు. గంపగుత్తగా నీళ్లు తరలించేందుకు పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుకు భారీ స్కెచ్ వేసినా ఈ ప్లాన్ కర్ణాటక, మహారాష్ట్రకు అర్థం అయ్యిందని.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం అర్థం కాలేదని అన్నారు.

నల్లమలసాగర్ సూత్రధారి ఆదిత్యానాథ్

ఢిల్లీ మీటింగ్‌కు పోను అంటూనే.. చర్చే లేదంటూనే.. కమిటీ కూడా లేదని రేవంత్ అన్నారని.. ఇప్పుడమో కమిటీ వేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ఏపీ కమిటీ వేస్తే, రేవంత్ కూడా కమిటీ వేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పేర్లు కూడా సూచించారని.. డిసెంబర్ 15న చంద్రబాబు కమిటీ వస్తే, 23న రేవంత్ వేశారని పేర్కొన్నారు. ఆ కమిటీలో చంద్రబాబు దాసుడు, చంద్రబాబు సూచించిన ఆదిత్యానాథ్ దాస్ పేరు సూచించారని ఆరోపించారు. దోపిడీదారుల ఏజెంట్, ఏపీకి నమ్మిన బంటు, ఇప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడని.. అడుగడుగునా తెలంగాణ ఆకాంక్షలకు, నీటి హక్కులకు అడ్డుపడ్డ సైంధవుడు ఆయన అని పేర్కొన్నారు. తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా ఎట్లా చేయవచ్చో ఆంధ్రా ప్రభుత్వానికి నేర్పించిందే ఆయన అని వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ వేగంగా పూర్తిచేసేందుకు తోడ్పాటు అందించింది కూడా ఈయనేనని గుర్తుచేశారు. పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టులకు తెరవెనుక సూత్రధారి ఆయనే అని అన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్ ఈ ఆదిత్యానాథ్‌దాస్‌ను నీటి పారుదల శాఖ సలహాదారుగా నియమించుకున్నారని ఆరోపించారు. కమిటీనే వేయొద్దంటే, కమిటీ వేసి ఆదిత్యానాథ్ చైర్మన్‌ను చేశారని.. దొంగ చేతికి తాళం ఇచ్చారని అన్నారు. రేవంత్ కోవర్టు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నారు.

టెండర్లు ముగిశాక కోర్టుకు..

ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 11 చివరి తేదీతో టెండర్ వేస్తే, అది అయిపోయాక తెలంగాణ ప్రభుత్వం 16న కోర్టుకు వెళ్లిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ కేసును నీరు కార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 23న కమిటీ వేసిందన్నారు. కేసు వేసినప్పుడు కోర్టులో తేల్చుకోకుండా కమిటీ ఎందుకు, చర్చలెందుకు, అందులో ఆదిత్యానాథ్ దాస్ ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలో ముగ్గురు ఆంధ్రా మూలాలు ఉన్న వాళ్లను పెట్టారని అన్నారు. ఏపీ జలదోపిడీ సాగాలె, తెలంగాణ నిండా మునగాలె అనేదే సీఎం లక్ష్యమన్నారు. గోదావరి-బనకచర్లకు అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చిందని.. ఈ ప్రభుత్వానికి సోయి లేక మొద్దు నిద్ర నటిస్తున్నదని అన్నారు. అసలు అనుమతి వచ్చిన విషయం ఈ ప్రభుత్వానికి తెలుసా లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ మీటింగ్ అయిన 15 రోజులకే బనకచర్లకు అనుమతి వచ్చిందన్నారు. ఆ మీటింగ్‌లో అంగీకరించారు కాబట్టే పర్మిషన్ వచ్చిందన్నారు. కమిటీ వేయొద్దని.. ఆదిత్యానాథ్ దాస్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి నోరు పారేసుకోవడం తప్ప చేసేదేం లేదన్నారు. అసెంబ్లీలో చిల్లర ప్రసంగం మాని గోదావరి నల్లమలసాగర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి కదలాలని.. సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేద్దామని.. బీఆర్ఎస్ కలిసి వస్తుందని చెప్పారు.

Next Story