‘కోపం కేసీఆర్‌పై పెంచుకోండి.. ప్రజల మీద కాదు’: సీఎం రేవంత్‌కు హరీష్ రావు సూచన

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-21 07:54:32  IST  )

శేరిలంగంపల్లి నియోజకవర్గం ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖాన(Basti Dawakhana)ను మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సందర్శించారు.

‘కోపం కేసీఆర్‌పై పెంచుకోండి.. ప్రజల మీద కాదు’: సీఎం రేవంత్‌కు హరీష్ రావు సూచన
X

దిశ, శేరిలింగంపల్లి: శేరిలంగంపల్లి నియోజకవర్గం ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖాన (Basti Dawakhana)ను మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. కేసీఆర్(KCR) పాలనలో బస్తీ దవాఖానలు అద్భుతంగా పనిచేశాయి. బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దు. తమ గడప దగ్గరనే, తమ వాకిట్లోనే వైద్యం అందించాలని ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానలను కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళం. 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషంట్ల ఫోన్లకే రిపోర్టులు పంపించే వాళ్ళం. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టింది. ఆరు నెలల నుండి జీతం రావడం లేదు. బస్తీ దవాఖానలో పనిచేసే సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వారు పని ఎలా చేస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి. చెప్పడమేమో ఒకటో తారీకు అందరికీ జీతాలు ఇస్తామని చెప్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతం లేదు. కేవలం 60, 70 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. 40 రకాల మందులు సప్లై లేదు.

పేషెంట్లను మాట్లాడితే కొన్ని మందులు ఇస్తున్నారు.. కొన్ని మందులు బయట కొనుక్కోవాలని చెప్తున్నారు అని అంటున్నారు. టెస్టులలో బీ12 d3 టెస్టులకు రీ ఏజెంట్లు సప్లై లేకపోవడం వల్ల అన్ని రకాల టెస్టులు జరగడం లేదు. బస్తీ దవాఖనలో మందులు సరఫరా చేసే తెలివి ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ సిబ్బందికి జీతాలు వస్తున్నాయా లేదా అనే రివ్యూ చేసే తెలివి కూడా రేవంత్ రెడ్డి(Revanth Reddy)‌కి లేదని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 108 సర్వీస్ సకాలంలో రాకపోవడం వల్ల, వైద్యం అందకపోవడం వల్ల మనిషి ప్రాణం పోయింది. హాస్పిటల్లో కేసీఆర్ కిట్టు ఇవ్వకపోవడం వల్ల 20% డెలివరీలు ప్రైవేటు ఆసుపత్రికి బదిలీ అయ్యాయి. కేసీఆర్ మీద కోపంతో పథకాలను బంద్ చేస్తే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంతసేపు మద్యం దుకాణాలు పెంచుదామా, సారా ఎట్లా అమ్ముదామా, పైసలు ఎట్ల సంపాదిద్దామా, అని తప్ప వేరే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. వైన్ షాపుల టెండర్లకు రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు.

జూబ్లీహిల్స్(Jubilee Hills) ప్రజలు హైదరాబాద్ ప్రజలు గమనించాలి. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటేస్తే బస్తీ దవాఖానలలో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా వారికే ఓటు వేసి గెలిపిస్తే నిర్లక్ష్యం చేస్తారు.. ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలి. జూబ్లీహిల్స్‌లో ఉండే మీ బంధుమిత్రులకు కాంగ్రెస్ నిర్లక్ష్యం గురించి చెప్పండి అని హరీష్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు.

Read More: KTR: నీతి, రీతి ఏమైనా ఉందా?.. దానం వ్యవహారంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

Next Story