- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా?.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్
‘గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ వేదిక మీదనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. నీ ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపించి తెలంగాణకు చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేస్తా’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ వేదిక మీదనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. నీ ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపించి తెలంగాణకు చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేస్తా’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతుభరోసా సంబరాల్లో భాగంగా సీఎం చేసిన వ్యాఖ్యలపై ‘ఎక్స్’ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమం అని మరిచి.. ప్రత్యేక రాష్ట్ర సాధకుడు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంస్కారం లేని విధంగా మాట్లాడి తన చిల్లర బుద్ధిని మరోసారి ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు రేవంత్‌రెడ్డి శనిలా, శాపంలా మారారని పేర్కొన్నారు. ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే’ అనే రీతిలో పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారని తెలిపారు. ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే ఎటూ పాలుపోక నిరాశ నిస్పృహలతో ప్రతిరోజూ అబద్ధాలతో, బూతులతో నెట్టుకొస్తానంటే కుదరదని హెచ్చరించారు. ‘అధికారంలో ఉండి.. సీఎం స్థానంలో ఉండి.. సభా నాయకుడిగా వ్యవహరిస్తున్న నీకు అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు ప్రతిపక్షం డిమాండ్ చేయాల్సిన పనిలేదని తెలియదా రేవంత్ రెడ్డి’ అని నిలదీశారు.
గెలుపుపై భరోసా లేకనే రైతు భరోసా..
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై భరోసా లేకనే విధి లేని పరిస్థితుల్లో రైతుభరోసా వేసి తానే రైతులకు చాంపియన్ అనే బిల్డప్ రేవంత్‌రెడ్డి ఇస్తున్నారని.. దానిని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారి రైతులకు పెట్టుబడి సాయం చేయాలని ఆలోచించి.. రైతుబంధు మొదలు పెట్టి రూ.80 వేల కోట్లు అన్నదాతల అకౌంట్లలో వేసి వ్యవసాయాన్ని పండగలా చేసిన కేసీఆర్‌ను ఉరితీయాలని ఉన్మాదిలా మాట్లాడుతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్లే ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే ప్రపంచం నవ్విపోతున్నదని పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎడారిగా మారితే ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశం నెంబర్ వన్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కనీసం ఒక చెక్ డ్యామ్ కట్టారా..? ఓ కాలువ తవ్వారా..? అని నిలదీశారు. కల్వకుర్తి, నెట్టెం పాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీరిచ్చామని.. ఇరిగేషన్ శాఖలో ఈ వివరాలు ఉన్నాయని.. అధికారులను అడిగి తెలుసుకో రేవంత్ రెడ్డి అని సూచించారు. కృష్ణా జలాలపై ఎన్నిసార్లు వాస్తవాలు చెబుతున్నా పనిగట్టుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
చిత్తశుద్ధి ఉంటే కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వు..
‘మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయని దద్దమ్మవి నీవు. ఇప్పుడు అన్నారం, సుందిళ్ల కూడా కూలిందని అని అంటున్నావ్. నీది నోరా, మోరా? నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఇసుమంతైనా నిజాయితీ ఉంటే 30 లక్షలు మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఇచ్చి మాట్లాడు రేవంత్ రెడ్డి?’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. మహిళలకు వడ్డీ లేని రుణాలపై, ఉద్యోగ నియామకాలపై అదే పనిగా అబద్ధాలు చెబితే అవి నిజాలై పోతాయా అని ప్రశ్నించారు. సన్న వడ్లకు బోనస్‌ను రైతుల అకౌంట్లలో వేశానని బోగస్ మాటలు చెప్పొద్దని.. నిజాయితీ ఉంటే రూ.1,200 కోట్ల బోనస్ బకాయిలు అకౌంట్లలో వేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ పిల్లి శాపాలకు ఉట్లు తెగయనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. ‘గెలిచిన వాడు రాజు, ఓడిపోయిన వాడు రావణాసురుడు అని అంటున్నావు. రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా? ఉన్మాదంలో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతున్నదా’ అని ప్రశ్నించారు. హామీలపై ప్రశ్నిస్తున్నందుకు మాపై బూతులతో చెలరేగుతున్నా.. తాము సంయమనం కోల్పోమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా వెంటపడుతూనే ఉంటామని.. అబద్ధాల పుట్టను బద్దలు కొడతామని హెచ్చరించారు.






