Harish Rao: ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతావ్.. ఇథనాల్ ఫ్యాక్టరీ పోరుపై హరీశ్‌రావు రియాక్ట్

by Ramesh Naini |

ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతావ్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

Harish Rao: ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతావ్.. ఇథనాల్ ఫ్యాక్టరీ పోరుపై హరీశ్‌రావు రియాక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతావ్ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు. నిన్న జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో (Ethanol factory) ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లు, పోలీసులు (farmers) రైతులపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఇవాళ (గురువారం) మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. బీద రైతుల కడుపు కొట్టి బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిపోయిందని ఆరోపించారు. పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకునే సీఎం తన జిల్లాలోనే ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా స్పందించరా? అని ప్రశ్నించారు. పోలీసులు 12 గ్రామాల రైతులను కొట్టి, 40 మందిపై కేసులు పెట్టి, 12 మంది రిమాండ్ కి పంపించడం దుర్మార్గమన్నారు. రైతులను కొట్టించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానిపై కానీ, బౌన్సర్లపై కానీ ఎందుకు కేసులు పెటలేదో చెప్పాలని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినాయి? అని ప్రశ్నించారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన లంబాడా రైతులకు బేడీలు వేసిన ఘటనపై కేంద్ర మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పుపట్టినా బుద్ధి రాలేదన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన రైతులను కొట్టారని తెలిపారు. రియల్ ఎస్టేట్ దందాలు పెంచుకోవడానికి 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ విషయంలో కూడా రైతులపై కేసులు పెట్టారని గుర్తుకు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఫార్మా సిటీ భూములు తిరిగిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చి తిరిగి అదే రైతులపై కేసులు పెట్టారని ఆరోపించారు. జహీరాబాద్ న్యాలకల్ రైతులపై విచక్షణారహితంగా దాడి చేసి అక్రమ కేసులు పెట్టించారని వివరించారు. సూర్యాపేట జిల్లా చిలకలూరు గ్రామం రైతులు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే 42 మందిపై కేసులు పెట్టి పోలీస్ జులుం చూపించారని తెలిపారు.

ధాన్యం కోతలను ప్రశ్నించినందుకు నిర్మల్ జిల్లా ఏర్వచింతలో రైతులపై కేసులు పెట్టించారని అన్నారు. రైతులకు, ప్రజలకు పనికి వచ్చే ఒక్క పని చేయడం లేదు కానీ, పెద్దలకు మాత్రం భూములను కట్టబెడుతన్నావని అన్నారు. రైతులను కొట్టు.. కమీషన్లు పట్టు అనే విధంగా రేవంత్ పాలన సాగుతుందని విమర్శించారు. తెలంగాణ రైతు లోకం తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. నిన్న అరెస్ట్ చేసిన పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ పక్షాన డిమాండ్ చేశారు.

Next Story