Harish Rao: దొంగచేతికి తాళాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి తీరు.. హరీశ్ రావు హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

నల్లమలసాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే పాత్ర దారి రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Harish Rao: దొంగచేతికి తాళాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి తీరు.. హరీశ్ రావు హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల, నల్లమలసాగర్ ఏ ప్రాజెక్టైనా అందులో జరిగేది తెలంగాణ జలదోపిడియేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‍రావు (Harish Rao) విమర్శించారు. గోదావరి బనకచర్లతో జల దోపిడికి ప్రయత్నం చేసిన ఏపీ తన నష్టాన్ని తగ్గించడం కోసం బనకచర్ల నుంచి నల్లమల సాగర్‍కు (Nallamala Sagar Project) మార్చుకుందని ఆరోపించారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. నల్లమలసాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు, పాత్ర దారి రేవంత్ రెడ్డి అని, కత్తి చంద్రబాబుదైనా (Chandrababu Naidu) పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జల ద్రోహానికి పాల్పడుతున్నాడని ఆయన ముఖ్యమంత్రినా లేక చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నాడా? అని నిలదీశాడు.

చెప్పినా వినకుండా మీటింగ్‍కు వెళ్లారు

బనకచర్ల (Banakacharla Project) విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి వెళ్లొద్దని రేవంత్ రెడ్డికి సూచించామని ఆ సమావేశానికి వెళ్లనని చెప్పిన ముఖ్యమంత్రి మీటింగ్‌కు వెళ్లి సంతకం చేసి వచ్చారని హరీశ్‍రావు ఆరోపించారు. అపెక్స్ మీటింగ్‍కు కాకుండా వేరే ఏ రకమైన సమావేశానికి హాజరు కావొద్దని మేం ఆనాడు గట్టిగా హెచ్చరించినా వినిపించుకోలేదన్నారు. మేం నిలదీస్తే, నిలబెట్టి కడిగేస్తే బనకచర్ల మీటింగ్ ఎజెండాలోనే లేదని కనుక చర్చ జరిగే ప్రసక్తే లేదని డైలాగులు చెప్పారు. కానీ అక్కడ జరిగిందేమిటో ఎజెండా ఏమిటో మేం బయట పెట్టి బట్టబయలు చేశామన్నారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా బనకచర్లపై చర్చ జరిగిందని, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసేందుకు కమిటీ ఏర్పాటు అయ్యిందని మీడియా ముఖంగా చెప్పారన్నారు. బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టి రణభేరి మోగించిందే బీఆర్ఎస్ పార్టీ అని నేను ముల్లుకర్ర కాదు బల్లెం పెట్టి పొడిస్తే గాని ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదన్నారు. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, ఎప్పటికప్పుడు హెచ్చరించినా ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించకపోగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత డేట్లు వేసి లెటర్లు విడుదల చేశారని ఆరోపించారు.

ఆ ప్లాన్ వారికి ఎప్పుడో అర్థమైంది:

పేరుకు మాత్రమే ప్రాజెక్టు ఆపుతున్నాం అని ఏపీ ప్రకటించింది. కాని వాస్తవంలో అది ఆగలేదని పోలవరం నుంచి బనకచర్లలో కలపకుండా, పోలవరం నల్లమల సాగర్‍కు లింకు చేశారన్నారు. గోదావరి నీళ్లు కృష్ణా ద్వారా తరలిస్తే, గోదావరి అవార్డు ప్రకారం, 45:21:14 తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఈ రూల్ వర్తిస్తుంది. ఈ విధంగా కూడా తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణాలో కలుపకుండానే, పెన్నా బేసిన్‍కు గోదావరి నీటిని తరలించే పెద్ద కుట్రకు రేవంత్ రెడ్డి తెరతీశాడని ఆరోపించారు. నిజానికి పోలవరం బనకచర్ల విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడో మేల్కొని కేంద్రానికి లేఖలు రాస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోయిందన్నారు. తెలంగాణతో సహా ఏ రాష్ట్రానికి దక్కుండా చేసేందుకు గంపగుత్తగా నీళ్లు తరలించేందుకు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఏపీ భారీ స్కెచ్ వేస్తే ఈ ప్లాన్ కర్ణాటక, మహారాష్ట్రకు అర్థం అయ్యింది కానీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం అర్థం కాలేదని ఆరోపించారు.

ఏపీకి నమ్మిన బంటు రేవంత్ రెడ్డికి సలహాదారుడా?

ఢిల్లీ మీటింగ్‍కు వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి చర్చే లేదు కమిటీ లేదన్న రేవంత్ రెడ్డి ఏపీ కమిటీ వేస్తే, రేవంత్ రెడ్డి కూడా కమిటీ వేశారని. కేంద్ర ప్రభుత్వానికి పేర్లు కూడా సూచించారని ధ్వజమెత్తారు. ఆ కమిటీని చంద్రబాబు వ్యక్తి ఆదిత్యానాథ్ దాస్‍తో వేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ దారుల ఏజెంటు, ఏపీకి నమ్మిన బంటు ఆదిత్యానాథ్ దాస్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సలహాదారుడు, తెలంగాణకు వెన్నుపోటు దారుడు ఘనత వహించిన ఈ ఆదిత్యానాథ్ దాస్ అని ధ్వజమెత్తారు. అడుగడుగునా తెలంగాణ ఆకాంక్షలకు, నీటి హక్కులకు అడ్డుపడ్డ సైంధవుడు ఎవరు? ఇదే ఆదిత్యానాథ్ దాస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా ఎట్లా చేయవచ్చో ఆంధ్రా ప్రభుత్వానికి నేర్పించింది, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ పక్షాన అత్యంత శ్రద్దగా 100కి పైగా లేఖలు సంధించిందెవరు? ఇదే ఘనత వహించిన ఆదిత్యానాథ్ దాస్ అని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ వేగంగా పూర్తి చేసేందుకు తోడ్పాడు అందించింది ఇదే ఆదిత్యానాథ్ దాస్ అని ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన చట్టానికి ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా పోలవరం విస్తరణ పనులు చేపట్టి, సామర్థ్యానికి మించి గోదావరి జలాలు పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టులకు తెరవెనుక సూత్రధారి ఆయనే అని చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి ఈ ఆదిత్యానాథ్ దాస్‍ను నీటి పారుదల శాఖ సలహాదారుడిగా నియమించుకున్నారనేది స్పష్టం అన్నారు. అసలు కమిటీనే వేయొద్దంటే కమిటీ వేశారని ఆ కమిటికి ఆదిత్యానాథ్ చైర్మన్ అంటే దొంగకు తాళం ఇచ్చినట్లే కదా? అని ప్రశ్నించారు. రేవంత్ కోవర్ట్ అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు, జల ద్రోహి అని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం 11.12.2025 చివరి తేదీతో టెండర్ వేస్తే, అది అయిపోయాక తెలంగాణ ప్రభుత్వం 16 తేదీ నాడు కోర్టుకు వెళ్లింది.

రేవంత్ రెడ్డి ఢిల్లీకి కదలాలి:

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు జారీ చేసిందిని తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండానే సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం, నీటి ప్రయోజనాలకు గండి పడుదుంతని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనుమతులు వచ్చాయని ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు పారేసుకోవడం తప్ప చేసేదేం లేదని ఇకనైనా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలన్నారు. అసెంబ్లీలో చిల్లర ప్రసంగం కాదు.. బనకచర్ల, గోదావరి నల్లమలసాగర్ కు వ్యతిరేకం అని అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. సీడబ్ల్యూసీ అనుమతుల రద్దు కోరుతూ ఢిల్లీలో ధర్నా చేద్దాంమని రేవంత్ రెడ్డి ఢిల్లికి కదలాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‍లో కూర్చొని ఆంధ్రాకు, బాబుకు దాసోహం కావోద్దన్నారు.

Next Story