- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: ఏంటా మొద్దు నిద్ర.. తట్టి లేపేదాక సోయి లేదా?
ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను రేపు ఉదయం సందర్శిస్తామని.. తాము వెళ్తుంటే పోలీసులు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని మాజీమంత్రి హరీశ్‌రావు కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను రేపు ఉదయం సందర్శిస్తామని.. తాము వెళ్తుంటే పోలీసులు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని మాజీమంత్రి హరీశ్‌రావు కోరారు. మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదని.. మొదటి మీటింగ్‌లోనే మన ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీకి అప్పజెప్పి వచ్చారని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతున్నదని మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపేదాక సోయి లేదని పేర్కొన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదం బాధ కలిగించింది..
ఎస్ఎల్బీసీ ఘటన చాలా బాధ కలిగించిందని.. 8 మంది కార్మికులు, వారి కుటుంబాల గురించి ఆలోచిస్తే చాలా ఆవేదన కలుగుతున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇటువంటి దురదృష్టకర ఘటనపైనా కాంగ్రెస్ నాయకులు కుటిల రాజకీయ వ్యాఖ్యలు చేయడం మనస్తాపం కలిగించిందని చెప్పారు. ఘటన జరిగిన తర్వాత తాము చాలా సమన్వయంగా వ్యవహరించామని.. కాంగ్రెస్ నాయకులు వికృతమైన కామెంట్స్ చేయడంతో తాము బదులివ్వక తప్పలేదని అన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని.. అత్యంత సంక్లిష్టమైన ఎస్ఎల్బీసీ సొరంగాన్ని 11.48 కిలోమీటర్లు తవ్వినమనేది రికార్డెడ్ ట్రూత్ అని స్పష్టం చేశారు. తనతోపాటు సొరంగానికి వచ్చిన నాటి సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తానా అంటే తందాన అని అబద్ధాలాడుతున్నడని.. అందుకనే తాము మాట్లాడవల్సి వస్తున్నదని పేర్కొన్నారు. 2005-14 మధ్య కాంగ్రెస్ రూ.3,300 కోట్లు ఖర్చు పెడితే, 2014 -23 మధ్య బీఆర్ఎస్ రూ.3,900 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు. సాంకేతిక సమస్యలు ఎదురైనా 12 కిలోమీటర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని.. ఎస్ఎల్బీసీ కింద రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో 90% శాతం పూర్తి చేశామని చెప్పారు.
కాళేశ్వరం బ్యారేజీలో ఒక్క బ్లాకు పిల్లర్ కుంగితే నానా యాగి చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఖమ్మంలో పెద్ద వాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిందని.. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిందన్నారు. పాలమూరు ప్రాజెక్టులోని వట్టెం పంప్ హౌజ్ నీట మునిగిందన్నారు. ఇప్పుడు ఎల్ఎల్బీసీ పరిస్థితి చూస్తున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో వారం రోజుల్లోనే రిపోర్టు తయారు చేసిన ఎన్డీఎస్ఏకు ఈ ఘటనలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం వల్లనే మౌనంగా ఉన్నారా అని నిలదీశారు. ఎస్ఎల్బీసీ ఘటనను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధారణ లీకేజీ ప్రకృతి విపత్తి అని మాట్లాడారని.. మరి కాళేశ్వరం విషయంలో ఈ ప్రకృతి విపత్తి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
ఉచితమని ఇప్పుడు ఎల్ఆర్ఎస్‌కు ఫీజులు..
బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎస్ చేపడితే భట్టి, ఉత్తమ్, సీతక్క, కోదండరాం పేద ప్రజల రక్తం తాగే స్కీం అని అన్నారని.. జనాలను రెచ్చగొట్టారని హరీశ్‌రావు పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తామని చెప్పారని.. ఇప్పుడు ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కోదండరాం ఉచితంగా చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఎందుకు మాట్లాడరు అని నిలదీశారు. ఆషాడం సేల్, దీపావళి బొనాంజ, దంతేరస్ ఆఫర్ల మాదిరిగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారని.. చూడబోతే ప్రైజులు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు, లక్కీ డ్రాలు కూడా ప్రకటిస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ముందు అంతా ఫ్రీ అని.. ఇప్పుడు 25శాతం డిస్కౌంటహో అని జేబులు ఖాళీ చేసే ప్రణాళిక వేస్తున్నారని ఆరోపించారు. ఫ్రీ అని చెప్పి చారాణా డిస్కౌంట్ ప్రకటిస్తూ మోసం చేస్తున్న రేవంత్‌కు ప్రజలు రేపు సీట్లలో 75శాతం భారీ డిస్కౌంట్ ఇస్తరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో రేవంత్ డిస్కౌంట్ సీఎంగా మిగిలిపోతారని అన్నారు.
గ్రాడ్యుయేట్లను కించపరిచేలా రేవంత్ కామెంట్స్
నాన్ కాంగ్రెస్, నాన్ బిజేపీ అభ్యర్థులలో మెరుగైన అభ్యర్థికి ఓటేసి ఎన్నుకోవాలని తాము పిలుపునిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి మాటల్లో ఓటమి భయం స్పష్టంగా బయటపడిందని.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు గ్రాడ్యుయేట్ ఓటర్లను కించ పరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. ‘మీ ఓటు మాకు చాలా విలువైనది. ఈ గెలుపు మాకు కీలకమైనది అని ఎవరైనా నాయకుడు అప్పీల్ చేస్తారు. కానీ సీఎం మాత్రం గెలిచినా గెలవకున్నా మాకు ఫరక్ పడదు అన్నడు. అంటే మీరు ఓటేసినా వేయకున్నా ఫరక్ పడదని చెప్పినట్లే కదా’ అని అన్నారు. వానాకాలం రైతుబంధు పైసలు ఖాతాల్లో పడ్డవాళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారని.. పడని వాళ్లు కాంగ్రెస్‌ను ఓడించండి అంటూ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఏవీ అమలు చేయని కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలన్నారు. అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓడించాలన్నారు. ఆంధ్ర, బిహార్ రాష్ట్రాలకు నిధుల వర్షం కురిపించి తెలంగాణకు మొండి చెయ్యి చూపించిన బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందన ఏదీ..?
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డితో రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో అప్పటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రూ.5 నుంచి 10లక్షల వరకు ఇచ్చారని చిన్నారెడ్డి బట్టబయలు చేశారని.. దీనిపై ఈడీలు, సీబీఐలు, ఐటీలు, ఎన్నికల కమిషన్లు ఎందుకు నోరు మెదపడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదని.. కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా అని నిలదీశారు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. బడే భాయ్, చోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అని అన్నారు. వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కాపలాగా పనిచేస్తున్నారని.. ఎమ్మెల్యే కేసు పెట్టుమంటే పెట్టాలె, తీసేయమంటే తీసేయాలె అనే స్థాయికి దిగజారారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఒక ఎమ్మెల్యేకు అధికారులు ఇంతగా భయపడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. నాడు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నేడు వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొన్నారు.






