- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఢిల్లీ వరకు వెళ్లాలా?:హరీశ్ రావు
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్‍కు (Polavaram Nallamala Sagar, Supreme Court) పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిజస్వరూపం, ద్రోహ బుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఈ మాత్రం విషయం మీ న్యాయవాది, మీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ గారికి తెలియదా? ఈ మాత్రం దానికి నీళ్ల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూటు బూటు వేసుకొని ఢిల్లీ వరకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో ఇవాళ రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై హరీశ్ రావు ఓ ప్రకటన ద్వారా స్పందించారు.
చంద్రబాబుకు రేవంత్ రెడ్డి సంక్రాంతి గిఫ్ట్:
ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న చారిత్రక ద్రోహం ఇది అని రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమేనన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథేనన్నారు. ఈ లోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకు పోతుందన్నారు. సంక్రాంతి పండుగ వేళ రేవంత్ చంద్రబాబుకు (Chandrababu Naidu) ఇచ్చిన గిఫ్ట్.. సుప్రీం కోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్టు అని ఆరోపించారు. పోలవరం నల్లమల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తోందని దుయ్యబట్టారు. 'పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు ఢిల్లీ మీటింగ్‍కు వెళ్ళారు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపారు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశారు. వేయను అంటూనే కమిటి వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశారు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టు కు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించారు' అని విమర్శించారు.
నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు:
మేం నిలదీస్తే బనకచర్లను అడ్డుకుంటాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం అని నమ్మ బలికిన రేవంత్ రెడ్డి, నేడు కావాలనే బలహీనమైన పిటిషన్ వేసి తెలంగాణకు మోసం చేశాడని మండిపడ్డారు. పంచాయతీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు మనమే కూర్చొని చర్చించుకుందాం అన్న రేవంత్ రెడ్డి మాటల అంతర్యం ఏమిటి? తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్ప చెప్పడమేనా మీ చర్చల లక్ష్యం? తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణ సమాజం క్షమించదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి.. మీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తామన్నారు.






