చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే లాభం లేదు: హరీశ్ రావు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-10 16:16:00  IST  )

తెలంగాణ హక్కులను కాపాడడంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు అట్టర్ ఫ్లాప్ అయ్యారని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు.

చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే లాభం లేదు: హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హక్కులను కాపాడడంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు అట్టర్ ఫ్లాప్ అయ్యారని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదీ జలాలను ఏపీ అప్పనంగా తీసుకుపోతున్నదని.. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని సీఎం చోద్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇండ్లెంట్లు లేవని.. బోర్డు అనుమతులు లేవని.. అయినా, ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా నీటిని తరలిస్తున్నదని పేర్కొన్నారు. ఇదే అంశంపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి ఈఎన్సీ లేఖ రాశారని.. దాని ప్రకారం 664 టీఎంసీలు అంటే 80 శాతం నీళ్లు ఏపీ వాడుకున్నదని పేర్కొన్నారు. ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే సీఎం, నీళ్ల మంత్రి గడ్డి పీకుతున్నారా అని ప్రశ్నించారు. జనవరి 28న తాత్కాలిక ఒప్పందం 66:34 ప్రకారం దాటి ఏపీ ఇప్పటికే 664 టీఎంసీలు వాడుకున్నదని.. ఇంకా రెండు రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుందని కేఆర్ఎంబీకి లేఖ రాశారని తెలిపారు. వెంటనే బోర్డు మీటింగ్ పెట్టాలని.. ఏపీ నీటి దోపిడీని ఆపాలని లేఖలో పేర్కొన్నారని చెప్పారు. 28న లేఖ రాస్తే అదే ఈఎన్సీ 31న రిటైర్ అయ్యారని తెలిపారు. ఆయన రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా పోస్టు భర్తీ చేయలేదని.. ఏపీ లెక్కకు మించిన నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడేమో మనకు ఈఎన్సీ నియామకం లేదని ఆరోపించారు. వారం రోజుల తర్వాత మీడియా ప్రశ్నిస్తే పోస్టు భర్తీ చేశారని అన్నారు. ఆయన బోర్డు మెంబర్ అని.. అయినా ఎందుకు ఖాళీ పెట్టారని నిలదీశారు. వాటా కుదరలేదా? మాట కుదరలేదా? వారం రోజులు ఎందుకు ఖాళీ? రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు.

ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నరు

ఈ వాటర్ ఇయర్‌లో జనవరి 29, 2026 నాటికి ఏపీ 664 టీఎంసీలు వాడుకున్నదని.. టెంపరరీ అగ్రిమెంట్ ప్రకారం ఏపీ 66 శాతమే వాడాలని.. కానీ 80 శాతం వినియోగించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారని నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఈ సీఎం అడగడం లేదని.. గురువు ఉన్నారని భయం రేవంత్‌కు పట్టుకుందని పేర్కొన్నారు. అందుకే.. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కండ్లు మూసుకు కూర్చుంటున్నదని ఆరోపించారు. వేసవి వస్తున్నదని.. రాష్ట్రానికి నీటి అవసరాలు ఉన్నాయని.. పంటలకు, పారిశ్రామిక అవసరాలు ఉన్నాయని తెలిపారు. తాత్కాలికంగా అయినా మనం 34 శాతం వినియోగించుకోవాల్సి ఉన్నదని.. కానీ వాడింది మాత్రం 20 శాతం మాత్రమేనని చెప్పారు. ఈరోజుకు కూడా ఏపీ 1.5 టీఎంసీల నీటిని తీసుకుపోతున్నదని పేర్కొన్నారు. ఇలా అయితే మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. సీఎం వైఫ్యల్యానికి ఇది నిదర్శనమని.. రేవంత్ ఈ రాష్ట్రం పాలిట శాపంగా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 664 టీఎంసీలు ఏపీ తీసుకుపోయిందని ఈఎన్సీ కేఆర్ఎంబీకి లేఖ రాస్తే, కేఆర్ఎంబీ రాసిన లేఖలో 555 టీఎంసీలు తీసుకుపోయిందని ప్రస్తావించిందని తెలిపారు.

బీజేపీ చేతిలో కేఆర్ఎంబీ

బీజేపీ ప్రభుత్వం చేతిలో కేఆర్ఎంబీ ఉన్నదని.. రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్ మీద పడి ఏడ్వడం తప్పిదే.. నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. కేఆర్ఎంబీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కడ బయటకు వస్తదో.. స్కాంలు ఎక్కడ బయట పడుతాయో అనే రేవంతు మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. రేవంత్, కిషన్‌రెడ్డి కలిసి తెలంగాణ గొంతు పిసుకుతారా అని నిలదీశారు. చంద్రబాబు, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉన్నా.. రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు ఎందుకు రాసిస్తున్నారని ప్రశ్నించారు. 19 ప్లేసుల్లో బీఆర్ఎస్ టెలిమెట్రీలు పెడితే మిగతా 9 ప్లేస్లుల్లో పెట్టడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందన్నారు. తక్షణమే స్పందించి ఏపీ నీళ్ల తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. క్యారీ ఫార్వర్డ్ విధానంలో పైనున్న శ్రీశైలంలో నీటిని ఆపి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని.. త్వరలో కేఆర్ఎంబీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రిని కలుస్తామని.. పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు.

Next Story