- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: అలా కొనసాగిస్తే.. శాశ్వతంగా కోల్పోవడానికి రెడీగా ఉండాల్సిందే
పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన అన్యాయంపై స్పందిస్తూ.. తక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల వందలాది తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,801 పీజీ సీట్లు ఉన్నాయని.. వీటిలో 50 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద వెళ్తాయని.. మిగిలిన 50 శాతం రాష్ట్ర కోటాలో ఉండే సీట్లలో 25 శాతం (సుమారు 450 సీట్లు) మేనేజ్‌మెంట్ కోటాగా ఉంటాయని తెలిపారు. అయితే.. ఈ సీట్లలో స్థానిక రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో మొత్తం సీట్లు ఆల్ ఇండియా విద్యార్థులకు వెళ్లిపోతున్నాయని పేర్కొన్నారు.
ఏపీలో 85 శాతం లోకల్ రిజర్వేషన్
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకే రిజర్వేషన్ కల్పిస్తూ, కేవలం 15 శాతం సీట్లు మాత్రమే నాన్ లోకల్ విద్యార్థులకు కేటాయించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ విధానంతో ఆ రాష్ట్ర విద్యార్థులకు పీజీ సీట్లలో పెద్దఎత్తున లాభం జరుగుతున్నదని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, మన రాష్ట్ర విద్యార్థుల అవకాశాలను ఇతర రాష్ట్రాల విద్యార్థులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. దీని వల్ల 450 పీజీ సీట్లు మొత్తం ఆల్ ఇండియా కోటాకు వెళ్లిపోతున్నాయని తెలిపారు. ఏపీ తరహాలో రిజర్వేషన్ కల్పిస్తే, ఈ 450 సీట్లలో 68 సీట్లు మాత్రమే ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయని.. మిగిలిన 382 సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తాయని.. కానీ ఈ రిజర్వేషన్ లేకుండా ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తే, 382 పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులు శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.






