- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: అబద్ధపు ప్రచారాలకు ఇది పరాకాష్ట
సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం, హైడ్రాలజీ అనుమతులు ఉన్నా కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో మభ్యపెడుతున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం, హైడ్రాలజీ అనుమతులు ఉన్నా కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో మభ్యపెడుతున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుపై నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి అవే అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నదని తెలిపారు. 2018లో బీఆర్ఎస్ సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించిందని, 2021లో 113.795 టీఎంసీల నీటి లభ్యతకు సీడబ్ల్యూసీ ఆమోదించిందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 6.74 లక్షల ఎకరాల సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు నీటిని ఇవ్వవచ్చని సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సైతం 2021లోనే నిర్ధారించినట్లు తెలిపారు. ఇంత స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్, హైడ్రాలజీ అనుమతులు ఉన్న సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టుకు అనుమతులు లేవని మాట్లాడడం ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు పరాకాష్ట అని ఆరోపించారు.
నాడు సమైక్య పాలకుల నీటి దోపిడీని అడ్డుకోకుండా పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పెదవులు మూసుకున్నారని.. నేడు తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ నాయకులు ఆంధ్రాకు తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని దోచుకుంటున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ 90శాతం సీతారామ పనులు పూర్తిచేస్తే, కాంగ్రెస్ కేసులతో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అవగాహన లేక అనుమతులు లేవు అని అబద్ధాలు మాట్లాడడం దుర్మార్గమని తెలిపారు. బీఆర్ఎస్ సాగునీటి విజయాలను కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమని తెలిపారు. సాగునీటి రంగంలో తెలంగాణకు 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన అన్యాయం చేస్తే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన విజయ బావుటా ఎగురవేసిందని పేర్కొన్నారు
ఆంధ్రా పాలకులను అడ్డుకునే సత్తా లేదు
కృష్ణానదిలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని, ఆంధ్ర పాలకులు గోదావరిలో నీటి దోపిడీకి పాల్పడుతుంటే, అడ్డుకునే సత్తా కాంగ్రెస్‌కు లేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఏడాదిన్నర పాలనలో కనీసం ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని, ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదని, ఇంకా బీఆర్ఎస్ సాధించిన సాగునీటి విజయాలను కాంగ్రెస్ నేతలు తమ ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ నీటిని అప్పనంగా కిందకు వదులుతూ రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని పేర్కొన్నారు. అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందనే భ్రమలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చేసిన అన్యాయాలు మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ హెడ్ వర్క్ ఆంధ్రాలో పెట్టి, శాశ్వతంగా తాళం వేసింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. రాజీవ్‌సాగర్ పైప్‌లైన్ కిన్నెరసాని వన్యప్రాణి కేంద్రం గుండా వేసి, అనుమతులు రాకుండా చేసింది ఎవరని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చిందని, రైతులను ఆదుకునేందుకు గోదావరి జలాలే ఏకైక మార్గమని ముందుగానే గ్రహించిన కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారని వెల్లడించారు.
కాంగ్రెస్ సృష్టించిన అంతర్రాష్ట్ర సమస్యలు, అటవీ అనుమతుల ఇబ్బందులను అధిగమించేందుకు, కేసీఆర్ సమీకృత సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేశారని, ఈ పథకం ద్వారా రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల్లో ప్రతిపాదించిన 3.33 లక్షల ఎకరాల ఆయకట్టతో పాటు, అదనంగా మరో 3.41 లక్షల ఎకరాలకు నీరందించి, నిల్వ సామర్థ్యాన్ని 1.2 టీఎంసీ నుంచి 10 టీఎంసీలకి పెంచి, 7,967 కోట్లతో పనులు ప్రారంభించారని తెలిపారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తుంటే, రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అక్కసుతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోసారి తెలంగాణ నీటిని ఆంధ్రాకు తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు.
ప్రజాపాలన అంటే ఇదేనా?
77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పోటీ పరీక్షల ఫలితాలను ఏ ముఖ్యమంత్రి కూడా తమ ఇంటి నుండి విడుదల చేయలేదని.. ఇది రేవంత్ రెడ్డి అహంభావానికి నిదర్శనమని హరీశ్‌రావు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని విమర్శించారు. ఎప్‌సెట్ విద్యార్థులను విష్ చేస్తూనే.. ఫలితాలను తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి విడుదల చేయడంపై ఫైర్ అయ్యారు. సీఎం అహంభావం, పాలన మీద, విద్యార్థుల మీద ఉన్న చులకన భావాన్ని తెలియజేస్తుందని తెలిపారు. అయితే కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి లేక జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి ఈ సీఎం పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అటు పోలీసులను, ఇటు అధికారులను పనిచేసుకోనివ్వడం లేదని పేర్కొన్నారు. సీఎం సెక్రెటేరియట్ మొఖం కూడా చూడడం లేదని తెలిపారు.






