ఇంత జరుగుతుంటే ఏమీ పట్టనట్టు ఉంటారా?.. సర్కార్‌పై హరీష్ రావు సీరియస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-04 17:01:51  IST  )

డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ.800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచడంలో పడిందని మాజీమంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

ఇంత జరుగుతుంటే ఏమీ పట్టనట్టు ఉంటారా?.. సర్కార్‌పై హరీష్ రావు సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ.800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచడంలో పడిందని మాజీమంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పాలిట శాపంగా మారిందని.. వారి చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నదని ఆరోపించారు. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. సకాలంలో పరీక్ష నిర్వహించకపోవడంతో పీజీ సెట్, లా సెట్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి మూడో సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగాని తనమే అని విమర్శించారు.

ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని పేర్కొన్నారు. రీయింబర్స్‌మెంట్ లేక యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని తెలిపారు. కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అద్దెలు, అప్పులు పెరిగిపోవడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లను నిలిపివేయగా, కొన్నిచోట్ల కళాశాలలకు తాళం వేసి ఇప్పటికే సెలవులు ప్రకటించారని తెలిపారు. ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టనట్లు సీఎం, మంత్రులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటని పేర్కొన్నారు. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో పెట్టారని, దానికీ అతీగతి లేదని తెలిపారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ చెప్పిన మాటలు గాలి మాటలే అయ్యాయని ఆరోపించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, తక్షణం డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Next Story