- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: రైజింగ్ కాదు ఫ్లయింగ్ సీఎం.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు సెటైర్లు

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసులు, డబ్బు, గుండాయిజం ప్రయోగించినా బీఆర్ఎస్ 40 శాతం 4 వేలకుపైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుని తన సత్తా చాటిందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ఇవాళ ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ఎరువుల కోసం గోసపడుతుంటే రేవంత్ రెడ్డి యాప్‌లు, మ్యాప్‌ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం, ఎమ్మెల్యేలకు లేని చెక్ పవర్ ఒక్క గ్రామ సర్పంచ్‌కే ఉందని అందువల్ల ధైర్యంగా పనిచేయండని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి మనుమడి సోకుల కోసం 100 కోట్లతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడిస్తారా అని నిలదీశారు. ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి కోపరేటివ్ ఎన్నికలు పెట్టడం లేదని,
రేవంత్ రెడ్డి రైజింగ్ సీఎం కాదు, ఢిల్లీకి హైదరాబాద్‌కు చక్కర్లు కొట్టే ఫ్లయింగ్ సీఎం అని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సర్పంచ్‌ల ఐదేళ్ల పదవీకాలంలో మిగిలిన మూడేళ్లు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఉంటారు. మీ పనుల బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాయని.. కారు జోరు కాంగ్రెస్ బేజారు అయిందన్నారు. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ 90 శాతం గెలిస్తే పది శాతం ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయి. కానీ బీఆర్ఎస్ 40 శాతం అంటే 4వేలకు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచింది. సంగారెడ్డిలో 34 సర్పంచులు గెలిస్తే అందులో 27 గెలిచామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. బీఆర్ఎస్ తరపున గెలిచిన (Sarpanch Election Results) సర్పంచులను కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 50 శాతంలోపే సర్పంచులు గెలిస్తే 66 గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ 10, 12 స్థానాలకు మించి గెలవదన్నారు. ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ కావాలని ఎదురుచూస్తున్నారన్నారు.
రేవంత్ రెడ్డి.. ఎప్పుడైనా నీ మొహానికి వ్యవసాయం చేసావా? రైతుల కష్టం మీకు తెలుసా? కేసీఆర్ హయాంలో కరెంటు ఫుల్లు. నీళ్లు ఫుల్లు. ఎరువులు ఫుల్లు. రేవంత్ రెడ్డి వచ్చాక రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారు, కరెంటు 14 గంటలు కూడా రావడం లేదు, ఎరువుల కోసం లైన్‍లో నిలబడి నిలబడి గోసపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల లారీలను ఊర్లకే పంపి రైతులకు అందిస్తే, రేవంత్ రెడ్డి వచ్చాక ఎరువుల కోసం గంటల తరబడి లైన్‍లో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. యాసంగి బోనస్, రెండు పంటల రైతుబంధు ఎగ్గొట్టారని రుణమాఫీ సగం మందికి కూడా చేయలేదని దుయ్యబట్టారు.
మున్సిపాలిటీల టైం అయిపోయి సంవత్సరం అవుతున్నా ఎన్నికలు పెట్టట్లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుందని కోపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే కూడా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుందామని జీవో ఇచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నువ్వు రైతులకు మేలు చేసేటోడివే అయితే కోపరేటివ్ ఎన్నికలు పెట్టు. ఎందుకు నామినేట్ చేస్తున్నావ్. నువ్వు ఎరువులు ఇయ్యలేదు. నువ్వు రుణమాఫీ చేయలేదు. రైతుబంధు ఎగ్గొట్టినవ్. బోనస్ డబ్బులు ఇయ్యలేదు. పంటల బీమా చేయలేదు కనుక ఎలక్షన్ పెట్టట్లేదన్నారు.
15వ ఆర్థిక సంఘం డబ్బులు 85 శాతం ఢిల్లీ నుంచి గల్లికే వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి, మంత్రులు ఆపలేరు. ఎమ్మెల్యే ఆపలేడు. డైరెక్ట్ సర్పంచుల ఖాతాల్లో పడతాయన్నారు. ర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు. మంత్రికి చెక్ పవర్ లేదు. ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు. కానీ గ్రామ సర్పంచ్‍కు చెక్ పవరుందన్నారు. ధైర్యంగా పని చేయండి. త్వరలో గెలిచిన సర్పంచ్‍లకు శిక్షణ కార్యక్రమాలు పెడతామన్నారు. సర్పంచ్ విధివిధానాలు, బాధ్యతలపై ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఏమున్నా రెండేళ్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. మీరు ఐదేళ్ల కోసం సర్పంచ్‍గా గెలిచారు. ఓడిపోయిన వారికి భవిష్యత్తు ఉంటది. గెలిచిన వారికి బాధ్యత ఉంటుంది.
గవర్నమెంట్ ఖజానా నుంచి ఐదు కోట్లతో సొంతంగా ఫుట్ బాల్ గ్రౌండ్ కట్టుకున్నాడు. నీ సొంత డబ్బుతో కట్టుకో రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేయడం కాదన్నారు. సింగరేణి సీఎస్సార్ డబ్బులతో కేసీఆర్ స్కూళ్లు కట్టించిండు. రోడ్లు ఏపించిండు. మెడికల్ కాలేజీలు పెట్టించిండు. కొత్త జిల్లాలు చేయాలి. కొత్త మెడికల్ కాలేజీ చేయాలి. మండల కేంద్రానికి రోడ్లు వేయాలని కేసీఆర్ పని చేస్తే రేవంత్ రెడ్డి ఏమో అందాల పోటీలు, ఫుట్ బాల్ మ్యాచ్, గ్లోబల్ సమ్మిట్ పేరుతో సోకులు చేయాలి. ఢిల్లీకి హైదరాబాద్ కి చక్కర్లు కొట్టాలన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.






