Harish Rao: మీ మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటడం లేదు.. సీఎంపై హరీశ్ రావు విమర్శలు

by Prasad Jukanti |

గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Harish Rao: మీ మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటడం లేదు.. సీఎంపై హరీశ్ రావు విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ (Food Poisoning Incidents) కారణంగా విద్యార్థులు ఆసుపత్రి పాలుకావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై శుక్రవారం ప్రెస్ నోట్ విడుదల చేసిన ఆయన.. కల్తీ ఆహారం విద్యార్థులకు పెడితే అరెస్టులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా ప్రకటించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా గురుకులాల తీరు ఉందని మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మీ మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల దీన స్థితే నిదర్శనం అని ఎద్దేవా చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఇకనైనా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, దామరవంచ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story