- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: అధికారంలోకి రాగానే సుద్దపూస మాటలా?.. సీఎంపై హరీశ్ రావు ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇస్తే నేడు లైబ్రరీల్లో విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇకపై హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ ఆవరణంలో (City Central Library) అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు, సభలు, ధర్నాలు నిర్వహించకూడదని సామూహికంగా నిలబడటం, నినాదాలు చేయడం నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పేరుతో లైబ్రరీ వద్ద నోటీసు ఏర్పాటు చేశారు. ఈ ఆంక్షలపై తాజాగా హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలన అనే ఏడో గ్యారంటీని మరచి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ దే:
గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఇప్పుడు సుద్దపూస మాటలు, నీతులతో బోర్డులు పెట్టినంత మాత్రాన పాపపరిహారం కాదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయం అంతా లైబ్రరీల చుట్టే జరిగిందని రాహుల్ గాంధీని సైతం లైబ్రరీకి తీసుకువచ్చి బూటకపు హామీలు ఇచ్చిన సంగతి మరిచిపోయారా? అధికారంలోకి రాగానే అవి రాజకీయ వేదికలు కావు, గ్రంథాలయాలు అని గుర్తు వచ్చాయా? అని నిలదీశారు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగులగొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.
జాబ్ క్యాలెండర్ ఏమైందని మీ నాయకుడిని విద్యార్థులు నిలదీసినందుకు ఈరోజు గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు ఏర్పాటు చేస్తారా? అని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక విధంగా, అధికారం పక్షంలోకి రాగానే మరొక విధంగా వ్యవహరిస్తారా? ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నదన్నారు. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసి 20 నెలల్లో 12 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరని విమర్శించారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






