- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ పక్కన ఉన్నవారే గార్బేజ్ బ్యాచ్.. అసెంబ్లీలో చర్చకు రెడీ: సీఎం వ్యాఖ్యలపై హరీశ్‌రావు కౌంటర్
కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (KTR) కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా చిట్ చాట్‌లో హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ బ్యాచ్ అని విమర్శించారు. అసలే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ.. ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెత్త వ్యాఖ్యలతో మరింత కాలుష్యం పెరిగిందని మండిపడ్డారు. బనకచర్ల పైన రేవంత్ రెడ్డి నగ్నంగా దొరికిపోయారని విమర్శించారు. ఆయన చీకటి బాగోతం కప్పిపుచ్చుకునేందుకు బజారులోని చెత్త అంతా మీడియా ముందు ఉంచారని అన్నారు. కేటీఆర్ సవాల్ విసిరితే చర్చకు రాని వ్యక్తివి..పైగా కేటీఆర్ పైన పిచ్చి వాగుడు వాగుతున్నావని ఫైర్ అయ్యారు. బనకచర్ల ప్రాజెక్టు ఎజెండాలో ఉన్నదని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు చెప్పారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఏమో బనకచర్ల అసలు చర్చకు రాలేదని అంటున్నారని ధ్వజమెత్తారు. డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
నీలా కేటీఆర్ బ్యాగ్‌లు మొయ్యలేదు.. నీ చుట్టూ ఉన్నవారు బ్యాగ్‌లు మోసేవారని ఆరోపించారు. పరిపాలన అంటే బ్యాగ్‌లు మోసుడు కాదు (CM Revanth Reddy) రేవంత్ రెడ్డి.. అని ఫైర్ అయ్యారు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ లోనే పాలన చేస్తున్నావని విమర్శించారు. సచివాలయానికి ఎందుకు పోవడం లేదు.. రోజు ప్రజలను కలుస్తా అని మాట ఇచ్చావు కదా? అని ప్రశ్నించారు. లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో సీఎం రేవంత్ రెడ్డి బాధ పడుతున్నారని విమర్శలు చేశారు. ఢిల్లీ పర్యటనకి సంబంధించి ఒక రోజు ముందు ఏపీకి షాక్ అని లీక్ ఇచ్చారని అన్నారు. మధ్యాహ్నం కల్లా బనకచర్ల ప్రాజెక్టు ఎజెండాలో ఉంటే పోయేది లేదు అని అన్నారని, రాత్రి కల్లా పరుగు పరుగున ఢిల్లీకి పోయారని తెలిపారు. నీటి ఒప్పందాల గురించి సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని, ఆయన ఇంటి దొంగ అని విమర్శించారు. ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలన్నారు. కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డికి రాదన్నారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే అసెంబ్లీ పెట్టాలని, అసెంబ్లీలో మా మైక్ కట్ చెయ్యకుండా నిజాయితీగా అన్ని అంశాల పైన చర్చకు బీఆర్ఎస్ రెడీ.. అని సవాల్ చేశారు.
చిల్లర మాటలు బంద్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారని, దుబాయ్‌లో ఎవరో చనిపోతే మా కేటీఆర్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ నీ దగ్గర ఏమైనా ఉంటే ముక్కులో పెట్టుకో అని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ పైన చేసిన ఆరోపణల్లో రుజువు ఉంటే చూపించు లేదంటే కేటీఆర్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్, కేటీఆర్‌ను అర్ధరాత్రి పూట కలిశాడు అని రేవంత్ రెడ్డి అంటున్నారు.. ఈ రాష్ట్రంలో అర్ధరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్ రెడ్డికే ఉందన్నారు. మా చుట్టూ నిఘా పెట్టారు.. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను రోజూ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మా వెనుక ఇంటెలిజెన్స్ వాళ్ళను పెట్టి ఎక్కడ అంటే అక్కడ తిప్పుతున్నారని తెలిపారు. మా అందరి ఫోన్స్ ట్యాప్ అవుతున్నవని ఆరోపించారు. విలేకరుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారా? నా తో విలేకరులు మాట్లాడేది ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు.






