- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్భుతమా? సైన్స్ మాయా?: శివలింగంపై నూనె పోస్తే పాలుగా మారుతున్న వింత!
దేవుడి మహిమో లేక రసాయన చర్యో కానీ.. చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేవుడి మహిమో లేక రసాయన చర్యో కానీ.. చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శివలింగానికి నూనెతో అభిషేకం చేస్తుంటే అది కాస్తా పాల రంగులోకి మారుతుండటంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం చిన్న వెంకటపల్లిలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన సంజీవరాయ వీరాంజనేయస్వామి ఆలయం ఉంది. అదే ప్రాంగణంలో ఉన్న శివాలయంలో ఇటీవల ఆరుద్ర నక్షత్రం సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ పూజా సమయంలో శివలింగంపై నూనె పోయగా.. అది అచ్చం పాలుగా మారి కిందికి జారుతున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శివలింగానికి అభిషేకం చేసేందుకు బారులు తీరుతున్నారు.
సైన్స్ ఏమంటోంది?
ఇది ముమ్మాటికీ పరమశివుడి మహిమేనని భక్తులు విశ్వసిస్తుండగా.. కొందరు నెటిజన్లు, హేతువాదులు మాత్రం దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందని విశ్లేషిస్తున్నారు. అభిషేకానికి వాడిన నూనెలో రసాయనాల మిశ్రమం ఉండి ఉండొచ్చని, ఆ కెమికల్స్ గాల్లోని తేమ లేదా నీటితో కలవడం వల్లే నూనె అలా తెల్లగా (పాలులా) మారుతోందని చెబుతున్నారు. కారణం ఏదైనా.. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఈ విచిత్ర ఘటనతో చిన్న వెంకటపల్లి శివాలయం మాత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది.






