Harish Rao: మైక్ కట్ చేయకుండా అవకాశం ఇవ్వండి.. అసెంబ్లీలో చీల్చిచెండాడుతాం

by Gantepaka Srikanth |

అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పెడితే అధికార పక్షాన్ని చీల్చిచెండాడుతామని.. దమ్ముంటే కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదికను ప్రవేశపెట్టాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు.

Harish Rao: మైక్ కట్ చేయకుండా అవకాశం ఇవ్వండి.. అసెంబ్లీలో చీల్చిచెండాడుతాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పెడితే అధికార పక్షాన్ని చీల్చిచెండాడుతామని.. దమ్ముంటే కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదికను ప్రవేశపెట్టాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు’ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వీక్షించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని జిల్లాల్లో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్‌ పాలన గాలికొదిలేశారని, రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిల్లు కావాలంటే 10 నుంచి 12 శాతం కమీషన్లు ఇవ్వాలని.. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు.

అది బేస్ లెస్ రిపోర్టు.. అంతా ట్రాష్

తమకు నోటీసులు రాకముందే మీడియాకు లీకులు ఇస్తున్నారని.. కుట్ర పూరితంగానే కమిషన్ విచారణ జరిగినట్లు కనిపిస్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీలో 665 పేజీల రిపోర్ట్ బయటపెట్టాలని.. నివేదికలో తమకు నచ్చిన అంశాలను మాత్రమే బయటపెట్టారని అన్నారు. ఇది బేస్‌లెస్‌ రిపోర్ట్ అని.. ట్రాష్ రిపోర్టు అని ఫైర్ అయ్యారు. దేశంలో ఎన్నో కమిషన్లు వేశారని.. న్యాయస్థానాల ముందు నిలబడలేదని అన్నారు. కాటన్ బ్యారేజీ కట్టినా కమిషన్ వేసి వేధించారని.. కానీ ఆయన ప్రజల్లో గుండెల్లో నిలిచారని అన్నారు. సీఎం రేవంత్ రాష్ట్రంలో ధారావాహిక సీరియళ్లు నడుపుతున్నారని.. కేసీఆర్‌ను హింసించాలన్నదే ఆయన ఉద్దేశమని పేర్కొన్నారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని.. జీవ సంపద ఉందని.. మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు ఉన్నాయని.. అందుకే అక్కడ ప్రాజెక్ట్ కట్టలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో తమ్మిడిహట్టి దగ్గర దమ్మెడు మట్టి ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క కాలువ తవ్వి, ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చారా అని నిలదీశారు. ‘రెండేళ్లలో ఢిల్లీకి కమీషన్ల మూటలు తీసుకెళ్లావు.. ప్రతిపక్షం మీద కమిషన్లు వేశావు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే రెండేళ్లలో కూడా రేవంత్‌రెడ్డి చేసేదేమీలేదన్నారు. కాళేశ్వరం ముమ్మాటికీ తెలంగాణ వరప్రదాయిని అని.. కేసీఆర్ సైతం ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతారని అన్నారు. కాళేశ్వరం కూలిందన్నోళ్లు గంధమల్లకు కొబ్బరికాయ ఎలా కొట్టారని హరీశ్‌రావు ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌ నుంచి మూసీకి నీళ్లు తీసుకొస్తానని చెబుతున్నారని.. ఆ నీళ్లు ఎక్కడివి అని నిలదీశారు. ప్రాణహిత-చేవెళ్లలో పెట్టిన ఖర్చు రూ.3,700 కోట్లు అయితే రూ.11 వేల కోట్లు ఖర్చు అని చెబుతున్నారని.. మొబిలైజేషన్‌ అడ్వాన్లు పేరుమీద రూ.2 వేల కోట్లు తిన్నారని ఆరోపించారు.

నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీనే చెప్పింది..

తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీనే చెప్పిందని.. అక్కడ 165 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా ఉందని తేల్చిందని హరీశ్‌రావు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతి ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్తున్న మాట అవాస్తమన్నారు. నీటి లభ్యత లేదని ఉమాభారతి అదే లేఖలో మరో పేరాలో పేర్కొన్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యం లేదని.. అన్ని అంశాలు డీపీఆర్‌లో ఉన్నాయని చెప్పారు. ఏడాదిలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి అనుమతులు సాధించామని తెలిపారు. ఒక ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులు వచ్చాయన్నారు. కేంద్రం, అనుమతులు ఇచ్చిన ఏజెన్సీలను కమిషన్‌ తప్పుబడుతున్నదా? అని నిలదీశారు. ఐదుగురు నిపుణులతో వేసిన కమిటీ సైతం మేడిగడ్డను సూచించిందని.. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నేరుగా తరలించలేమని మాత్రమే చెప్పారని వెల్లడించారు. వారి సూచనలతోనే నదీ ద్వారానే మేడిగడ్డకు తరలించాలని నిర్ణయించామని.. ఈ విషయం నిపుణుల కమిటీ తన అఫిడవిట్‌లో పేర్కొందని వెల్లడించారు. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారని నిపుణుల కమిటీనే కమిషన్‌కు చెప్పిందని తెలిపారు.

కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం నిర్మాణం

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తీసుకున్నామని.. గత కేబినెట్‌లోని ఇద్దరు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. కేబినెట్‌ కాకుండా అసెంబ్లీ అఫ్రూవల్‌ కూడా ఉన్నదని స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగంలోనూ కాళేశ్వరం అంశం ఉందని చెప్పారు. ఆర్థికమంత్రి ప్రసంగంలోనూ కాళేశ్వరంపై మాట్లాడారన్నారు. కేసీఆర్‌ కాళేశ్వరంపై అసెంబ్లీలోనే చర్చ పెట్టాక ఆయన సోలో నిర్ణయం అని ఎలా అంటారని నిలదీశారు. ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నెలరోజుల్లోనే ప్రధానికి కేసీఆర్‌ లేఖ రాశారని తెలిపారు. జాతీయ హోదా అడగడం తప్పా అని ప్రశ్నించారు. కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి ఏ అనుమతి ఉందని రేవంత్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టారని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించారని.. ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్లులు చెల్లించారని పేర్కొన్నారు. నారాయణపేట్‌-కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఒక్క అనుమతి ఉందో ఉత్తమ్‌ చూపించాలని డిమాండ్ చేశారు.

పోలవరానికి ఎన్‌డీఎస్ఏ ఎందుకు పోలేదు?

రాష్ట్రం పిలవకుండానే ఎన్‌డీఎస్‌ఏ వచ్చిందని.. ఎన్నికలకు ముందు మూడు రోజుల్లోనే నివేదిక ఇచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. మూడుసార్లు కూలిన పోలవరంపై ఎన్‌డీఎస్‌ఏ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. పోలవరం కట్టిన ప్రధాని మోదీపై చర్య తీసుకుంటారా.. పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వానిది బాధ్యతనా.. అని నిలదీశారు. రాజకీయ కుట్రతోని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చారని తెలిపారు. రెండు పిల్లర్లు కూలితేనే కేసీఆర్‌ది బాధ్యత అయితే.. ఎస్‌ఎల్‌బీసీ కూలిన ఘటనలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సుందిళ్ల, అన్నారం సేఫ్‌ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారని.. రెండు పియర్లు కుంగితే కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రెండు పిల్లర్ల మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మళ్లీ వచ్చేది బీఆర్ఎస్‌ ప్రభుత్వమే అని.. తమ ప్రభుత్వం రాగానే రెండు పియర్లు బాగు చేస్తామని.. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని నిరూపిస్తామని హెచ్చరించారు.

Next Story