బహిరంగ చర్చకు సిద్ధమా? రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

by Prasad Jukanti |

భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్స్ విషయం ఎందుకు బయటకు రాలేదని హరీశ్ రావు ప్రశ్నించారు.

బహిరంగ చర్చకు సిద్ధమా? రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి నిన్న గంటన్నర సేపు ప్రెస్ మీట్ చూసినవారికి రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై సందేహం కలుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫలించకపోవడంతో ఆ ఫ్రస్టేషన్‍లో గంటన్నరసేపు అడ్డమైన చెత్త వాగారని ఈ ప్రభుత్వం నడపడం మాకు చేతకావడం లేదని ముఖ్యమంత్రి మాటల్లో తేలిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను చెప్పకనే చెప్పుకున్నారని రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వేయాలని అడిగారని ఎద్దేవా చేశారు. ఇవాల తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన చూసి ఓటేయమని అడిగారు. ఆనాడు టీడీపీలో ఉండి వైఎస్‍ఆర్ పావురాల గుట్టలో పావురం అయ్యాడు అని ఎలా అన్నావని ప్రశ్నించారు. ఆరోజు కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు అని క్షమాపణ చెప్పి నాటి కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలని అడగాలి.

నోరు తెరిస్తే అబద్ధాలు:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని అప్పుల విషయంలో సీఎందో మాట భట్టి విక్రమార్క మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏది పడితే అది మాట్లాడటానికి రేవంత్ రెడ్డి దారిన పోయే దానయ్య కాదని ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నారు. కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు 2,80,000 కోట్లు అని పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు తిరోగమనం పాలవుతోందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వేధింపులు, భూదందాల వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందన్నారు. వీటిపై రివ్యూ చేసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి తినే కంచంలో ఊంచే రకం అని హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయంలో కూర్చునేది నువ్వే కదా రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ ద్వారా మూసీకి తెస్తానని చెప్పింది నువ్వే కదా? అని నిలదీశారు. హైదరాబాదుపై కేసీఆర్ ముద్రను చెరపడం నీ జేజమ్మతో కూడా కాదని జూబ్లీహిల్స్ ప్యాలెస్ కిటికీలో నుండి చూస్తే నీకు కనపడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా? అన్నారు. నాలాల్లో పూడిక తీయకపోవడం వల్ల హైదరాబాదులో వరదలు వచ్చాయని వరదలకు కారణం రేవంత్ రెడ్డే అన్నారు.

ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఊకదంపుడు ఉపన్యాసమే తప్ప ఏమి లేదని అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ అయినా ఇచ్చావా రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. రుణమాఫీ, రైతుబంధు మీద చర్చిద్దాం అంటే ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి పారిపోయాడు ఈ ముఖ్యమంత్రి మీరని ఇప్పుడు పది రోజులు అసెంబ్లీ పెట్టు. ఆరు గ్యారెంటీలపై చర్చిద్దామన్నారు. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ఈ ముఖ్యమంత్రి ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయడం లేదన్నారు. కామారెడ్డిలో వరద బాధితులకు ఒక రూపాయి అయినా విడుదల చేశారా? ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు అడిగినందుకు ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. ఫీజు బకాయిలపై బహిరంగ చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? అని సవాల్ విసిరారు. పోయిన నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లకు విడుదల చేసిన బిల్లులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులను ఈ ప్రభుత్వం విడుదల చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి భయపెడుతున్నారుని దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు.

వారిది ఫెవికాల్ బంధం:

కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం అని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేదని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయని గుర్గావ్‍లో భట్టి విక్రమార్క ఇల్లు, ఆయన అత్తగారిల్లు ఉంది. ఈ విషయం ఎందుకు బయటకు రాలేదు. బీజేపీకి కాంగ్రెస్ కి మధ్యలో ఉన్న ఒప్పందం ఏమిటి? అని ప్రశ్నించారు. పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్ ఐతే ఎందుకు చెప్పలేదు. ఈడీ ఎందుకు పొంగులేటిపై ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదన్నారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి చీకటి ఒప్పందాలు ఉన్నాయన్నారు.

Next Story