రాజకీయ ఉచ్చులో హరీష్ రావు.. కవిత మళ్లీ నోరు విప్పితే ?

by Naga Rani Yarlagadda |

బీఆర్ఎస్ కీలకనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. కవిత ఎపిసోడ్ తర్వాత ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా ఆయన పరిస్థితి మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయ ఉచ్చులో హరీష్ రావు.. కవిత మళ్లీ నోరు విప్పితే ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ కీలకనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. కవిత ఎపిసోడ్ తర్వాత ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా ఆయన పరిస్థితి మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హరీశ్​రావుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు రాజకీయ అభాండాలు మోపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతితో పాటు ఆయనకు సంబం ధించి అనేక అంశాలను మీడియా సమావేశంలో ప్రస్తావించారు. కేసీఆ‌ర్‌, కేటీఆర్‌ను ఓడించడానికి ప్రయత్నాలు చేశారని, అందుకోసం ప్రత్యర్థులకు డబ్బులు సైతం ఇచ్చారని ఆరోపించారు. 2018 ఎన్నికల టైంలో కొందరు బీఆర్‌ఎస్​ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యక్తిగతంగా డబ్బు సమకూర్చారని, అలా ఎందుకు చేయాల్సివచ్చిందని, దాని వెనక ఉన్న రహస్య ఎజెండా ఏంటని ఆమె ప్రశ్నలు సంధిం చారు. హరీశ్​రావు వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ విశ్వసనీయతను ప్రశ్నించేలా పరోక్షంగా ఆమె సవాల్ విసిరారు. ఆమె ఆరోపణలపై సీరియస్‌గా స్పందించిన నేతలు ఎవరూ లేరు. ఏదో పైపైనే ప్రెస్‌మీట్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. గట్టిగా మాట్లాడితే ఆమెపై చేసే విమర్శలు కేసీఆర్‌కు తగులుతాయనే భయం, ఆమె మళ్లీ స్పందిస్తే ఇంకొన్ని విషయాలను బయటపెట్టొచ్చనే వారంతా భయపడుతున్నట్లు సమాచారం.

వెళ్లలేని స్థితిలో హరీశ్..

కవిత చేసిన ఆరోపణలకు గాను హరీశ్‌రావు బీఆర్ఎస్​నుంచి బయటికి వెళ్లిపోవాలని, ఇది తమ కుటుంబ పార్టీ అని, ఆమె పరోక్షంగా చెప్పిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమ పార్టీలో మీరేందుకు అన్నట్లుగా ఆమె ప్రెస్‌మీట్​సాగిందని గుర్తు చేస్తున్నారు. ఆయన మీద ఆరోపణలు చేసినందువల్లే ఆమెను కేసీఆర్​సస్పెండ్​చేశారు. ఈ టైంలో హరీశ్ కొత్త పార్టీ పెట్టడం లేదా మరో పార్టీలోకి వెళ్లాలనుకున్నా.. ప్రస్తుతం అటువైపు అడుగు వేయలేని స్థితిలో ఉన్నట్టు సమాచారం. ఆయన కోసమే కవితను కేసీఆర్ సస్పెండ్​చేశారని టాక్. అల్లుడికి, ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెను సస్పెండ్​చేశారని, ఇలాంటి టైంలో ఆయన బయటకు వెళ్లితే మరిన్ని విమర్శలతో పాటు రాజకీయ ప్రతిష్ఠ, విలువలు దెబ్బతింటాయని టాక్ వినిపిస్తున్నది. అందుకే ఆయన ఆగిపోతున్నట్టు సమాచారం.

నోరువిప్పాలంటున్న ఫాలోవర్స్..

హరీశ్‌రావుపై కవిత చేసిన ఆరోపణలు నిజమైతే కేసీఆర్..​ఆమెను ఎందుకు సస్పెండ్​చేస్తారని సిద్దిపేట ఎమ్మెల్యే ఫాలోవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఆమె ఆరోపణలను కేసీఆర్ పట్టించుకోలేదని, ఆయనకు వాస్తవాలు తెలుసని అంటున్నారు. అధినేత​చెప్పిన పనులనే హరీశ్ చేశారని, అందుకే తన అల్లుడి మీద కూతురు చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత సీరియస్‌గా తీసుకోలేదని విషయాన్ని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరో అడుగు ముందుకేసి హరీశ్ రావు నోరు విప్పాలని కోరుతున్నారు. మాట్లాడాలని మాజీ మంత్రి డిసైడ్ అయితే అందులో కేసీఆర్ పాత్ర సైతం ఉంటుందని.. వాటిని బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆయన్ను ఎంతగా అవమానించారో, ఆయన పడిన కష్టానికి వచ్చిన గుర్తింపు, ఇతర అనేక విషయాలు చెబుతారంటూ హరీశ్ వీరాభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకెంత కాలం ఆయన ఓపిక పట్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్​చెప్పిన పని చెప్పినట్లు చేసినందుకా ఈ అవమానాలు అంటూ ఫైరవుతున్నారు.

హరీశ్, సంతోష్ వల్లే కవిత సస్పెండ్..

హరీశ్, సంతోష్ రావు వల్లే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని కవిత ఆరోపించారు. దీనిపై హరీశ్ రావు ఏ విధంగా సమాధానం ఇవ్వనున్నారనే దానిపై రాజకీయాల్లో, పార్టీలోనూ ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఆదేశిస్తే ఆయన చేశారని, వాటిని ఇప్పుడు వక్రీకరించి కవిత మాట్లాడటం ద్వారా గులాబీబాస్‌ను సైతం ఈ ఆరోపణల పర్వంలోకి లాగడమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టాపిక్ మీద హరీశ్ రావు సైలెంట్‌గా ఉండటమే మంచిదని ముఖ్య అనుచరులు చెబుతున్నట్టు తెలుస్తోంది.

ప్రతిపక్ష నేతగా హరీశ్‌కు అవకాశం ఇవ్వొచ్చుగా..

బీఆర్‌ఎస్‌లో గత కొంత కాలంగా హరీశ్​రావుకు అవమానాలు జరుగుతున్నాయని ఆయన అనుచరులు అంటున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయనకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వలేదని, ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ దగ్గర ఉన్న రెండు కీలక పదవుల్లో ఒకటి హరీశ్ రావుకు ఇవ్వోచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని హరీశ్ ఆడిగారని.. కానీ అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని, కుటుంబ సభ్యులు కొంత అడ్డుపడ్డారని ప్రచారం ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ కోసం రెండున్నర దశాబ్దాలుగా కష్టపడిన హరీశ్​రావుకు అవమానాలు, ఆరోపణలు, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతిసే విధంగా చేశారే తప్ప మరేం లేదని ఆయన ఫాలోవర్స్ ఫీల్ అవుతున్నారు.

Next Story