రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు ఇదే నిదర్శనం : హరీష్‌రావు

by Naga Rani Yarlagadda |

ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టేవారిని కూడా గృహ నిర్బంధం చేయడం దారుణమని బీఆర్ఎస్ మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు ఇదే నిదర్శనం : హరీష్‌రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టేవారిని కూడా గృహ నిర్బంధం చేయడం దారుణమని బీఆర్ఎస్ మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిజామాబాద్ వేల్పూరులోని మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన నివాదం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. భీంగల్ లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆయన్ను ఇంటిలోపలికి పంపి హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.

భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆస్పత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కారును నిలదీస్తూ.. శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టాలని ప్రశాంత్ రెడ్డి నిర్ణయించుకుంటే.. ఆయన్ను పోలీసులు నిర్బంధించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటూనే ప్రతిపక్షాన్ని నిర్బంధించడం.. పోలీస్ రాజ్యాన్ని నడపడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. హిట్లర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ కి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులపై.. కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేత చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత దీక్షను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్ష అణచివేతే కాంగ్రెస్ లక్ష్యమని, వెంటనే ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధాన్ని ఎత్తివేయాలన్నారు.

Next Story