Harish Rao : ముఖ్యమంత్రికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : హరీశ్‌రావు

by Muthe.Rajitha |

‘రేవంత్‌రెడ్డి.. నీకు చేతనైతే కృష్ణా నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు’ అని మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు.

Harish Rao : ముఖ్యమంత్రికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : హరీశ్‌రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ‘రేవంత్‌రెడ్డి.. నీకు చేతనైతే కృష్ణా నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు’ అని మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. వనపర్తి వేదికగా సీఎం చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదని పేర్కొన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ.. మూసీ ప్రక్షాళన చేస్తామంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పదేపదే పాలమూరు బిడ్డను అంటూ, శుష్కమైన సెంటిమెంట్‌ను వల్లించడం తప్పితే పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదని పేర్కొన్నారు. నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులని.. కానీ, రేవంత్‌కు మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని తెలిపారు.

కాంగ్రెస్‌కు కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు, ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్లపాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపం? అని నిలదీశారు. బంగారం పండే నల్లరేగడి భూములున్న పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే అని పేర్కొన్నారు. తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్ అని, తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్.. ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణా జలాల గురించి మాట్లాడాలనుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం అని పేర్కొన్నారు. ‘నాడు తెలుగుదేశం నాయకుడిగా జలయజ్ఞం ధనయజ్ఞమని మాట్లాడింది మీ నోరే కదా.

శిలాఫలకాలు వేసి, కొబ్బరి కాయలు కొట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు దండుకొని, కనీసం భూసేకరణ కూడా పూర్తి దగాకోరు చరిత్ర కాంగ్రెస్‌ది’ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నత్తనడకన నడిచిన పనులను పరిగెత్తించి పూర్తిచేసింది బీఆర్ఎస్ అని.. ఇది పాలమూరులో ఏ రైతును అడిగినా చెబుతారని.. రివర్ వాటర్ పొలాలకు ఇచ్చింది రివర్స్ మైగ్రేషన్ పాలమూరులో జరిగేలా చేసింది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కల్వకుర్తి ప్రాజెక్ట్ కింద 3.07లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.42లక్షల ఎకరాలు, బీమా కింద 1.58లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ కింద 38వేల ఎకరాలు, తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్ కాల్వ కింద ఉన్న 55వేల ఎకరాలను స్థిరీకరించి, ఆర్డీఎస్‌లో మొత్తం 87,500 ఎకరాలకు సాగు నీరు అందించింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. జూరాల జలాశయంలో కర్ణాటక ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లించి, మొదటిసారిగా జలాశయంలో 9 టీఎంసీల నీటిని నింపి, లక్ష ఎకరాలకు సాగు నీరు అందించామని తెలిపారు.

మిషన్ కాకతీయతో చెరువుల స్థిరీకరణ

మిషన్ కాకతీయతో భాగంగా మహబూబ్‌నగర్‌లో 1,544 చెరువులు, నాగర్‌కర్నూల్‌లో 2,024, నారాయణ్‌పేటలో 950, గద్వాల్‌లో 563, వనపర్తిలో 1,329 మొత్తం 6,410 చెరువుల కింద 3,22,579 ఎకరాలు స్థిరీకరించామని హరీశ్‌రావు పేర్కొన్నారు. 66 చెక్ డ్యాంలు, ఐడీసీ లిఫ్ట్‌ల కింద మరో 24వేల ఎకరాలు స్థిరీకరించామని తెలిపారు. పదేండ్ల కాలంలో ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే దాదాపు 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. పాలమూరు బిడ్డల కష్టాలు తీర్చినమని, పదేండ్లు పచ్చగా పంటలు పండించుకున్న రైతులను అడిగితే చెబుతారని తెలిపారు. కృష్ణా బేసిన్‌లో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేదంటే ఆ పాపం కాంగ్రెస్‌దే అని.. ఎత్తిపోతల పథకాల్లో ఎక్కడా ఒక్క పెద్ద రిజర్వాయర్ కూడా కాంగ్రెస్ ప్రతిపాదించలేదని పేర్కొన్నారు.

కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టుల్లో కలిపి కనీసం 20 టీఎంసీల నిల్వ కూడా ఏర్పాటు చేయలేదని.. కానీ, బీఆర్ఎస్ ఒక్క పాలమూరులోనే 67టీఎంసీల నిల్వ కెపాసిటీని అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయ సముద్రం ఇలా మొత్తం వందకుపైగా టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని తాము ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఒకవైపు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు అడ్డుకోవడానికి కేసుల మీద కేసులు వేసి ఆలస్యమయ్యేలా చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా? అని ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన కేసుల వల్ల పాలమూరు రంగారెడ్డి పనుల్లో జాప్యం జరిగిందని.. అయినా అడ్డంకులను దాటి 80శాతం పనులు పూర్తిచేయగలిగామని తెలిపారు. కేసులు వేయకుంటే ఆ 20శాతం కూడా పూర్తయిపోయేదని.. పాలమూరుకు తీరని శాపం కాంగ్రెస్ పార్టీనే అని.. దత్తత తీసుకున్నానని చెప్పి దగా చేసిన చరిత్ర చంద్రబాబుది అని ఆరోపించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్ఎల్బీసీ పనులు

రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతిక పరమైన విషయాలు నిర్లక్ష్యం చేసి ఆదరబాదరగా ఎస్ఎల్బీసీ పనులు పరిగెత్తించారని.. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యుకుహరంలోకి నెట్టారని.. వారి ప్రాణాలు బలితీసుకొని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. నిజాయతీ ఉంటే ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. దోషులు ఎవరో తేల్చాలని సవాల్ విసిరారు. పచ్చి అబద్ధాలు, పిచ్చి సెంటిమెంట్లు నోటికి వచ్చినట్టు కారు కూతలు బంద్ చేయాలని సూచించారు. వాస్తవాలు తెలియక కాదని.. అతి తెలివితో జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2014-23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3,900 కోట్లు ఖర్చు చేసి 11.48 కిలోమీటర్లు తవ్విన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. నిధులు ఖర్చు చేయకుండానే 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు అయ్యాయా? కాంగ్రెస్ హయాంలో డిండి ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ అంటే పచ్చని పంటలు అని.. రేవంత్‌రెడ్డి అంటే పచ్చి అబద్ధాలు అని ప్రజలకు స్పష్టంగా అర్థమైందని తెలిపారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున సూట్ కేసులు మోయలేదని, ప్రజాభవన్‌లో కూర్చోబెట్టి పాదసేవ చేయలేదని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్చగా రోజుకు 10వేల క్యూసెక్కులు తరలించుకుపోతున్నారని, అడ్డుకోవాల్సింది పోయి, తమ మీద రంకెలు వేస్తున్నరని పేర్కొన్నారు. బీజేపీతో పగలు కుస్తీ.. రాత్రి దోస్తీ అని.. ఎస్‌ఎల్బీసీ ప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను ఆపారని, బీజేపీకి స్వాగతం పలికారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్డీఎస్ఏ స్పందించదు అని, చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ, ఐటీ విచారించవు అని ఆరోపించారు.

Next Story