- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
ఇటీవల కాలంలో వరుసగా స్వర్ణకారుల ఆత్మహత్యలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని, విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో వరుసగా స్వర్ణకారుల ఆత్మహత్యలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని, విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాకు స్వర్ణకారుల వేధింపులపై ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందని పేర్కొన్నారు. క్రమేణ వృత్తి పని చేస్తున్న వారికి ఉపాధి లేకుండా పోతుందని, వారి జీవనం నడవడమే ఇబ్బందికరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉందని.. నగలను ఎంతో పవిత్రగా చూస్తారని తెలిపారు. కేవలం స్వర్ణకారులే కాకుండా ఇతర కులాల వారు కూడా ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నారని గుర్తు చేశారు.
మహిళగా మెట్టెలు, మంగళసూత్రాలు చేయించాలంటే స్వర్ణకారుడి దగ్గరికి వెళ్తామే తప్ప పెద్ద పెద్ద షాపులకు వెళ్లబోమని.. భారతీయులు పవిత్రంగా భావించే బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ఆ బంగారం అమ్మిన దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక కొందరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని స్వర్ణకారులకు ఆమె సూచించారు. తాను నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో స్వర్ణకారులను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నానని గుర్తు చేశారు.
స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్న 411 చట్టానికి సవరణలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ 411 చట్టం కింద కేసులు పెట్టి స్వర్ణకారులను వేధిస్తున్నారని.. ఎమ్మెల్సీగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బీసీల కోసం ఉద్యమిస్తున్న నాయకురాలిగా ఈ చట్టం సవరణ కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చినట్లుగా స్వర్ణకారులతో పాటు అన్ని చేతి వృత్తిదారులను ఆదుకునే చర్యలు చేపట్టాలని అన్నారు. అప్పుడే వారు కార్పొరేట్ సంస్థలతో దీటుగా నిలబడగలుగుతారని సూచించారు. కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్నారని.. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్వర్ణకారులకు పిలుపునిచ్చారు. అంతే కానీ అందుకు ఆత్మహత్యలే పరిష్కారం కాదన్నారు. బతికుంటే ఏదైనా సాధించగలమనేది విషయాన్ని గుర్తించాలని.. బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలమని గుర్తించి.. సోదరిగా మీమ్మల్ని కోరుతున్నా అని కవిత అన్నారు.






