‘9600 ప్రాంతాల్లో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు’

by Dishanational2 |
‘9600 ప్రాంతాల్లో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు’
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా 9600 ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని వచ్చేనెల 6వ తేదీన నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ నేతలు వెల్లడించారు. సమస్త హిందూ యువకుల ఐక్యత కోసమే భజరంగ్ దళ్ నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏప్రిల్ 6వ తేదీన భాగ్యనగర్ లో నిర్వహించే ‘వీర హనుమాన్ విజయ యాత్ర-హిందూ శక్తి ప్రదర్శన’కు సంబంధించిన వాల్ పోస్టర్లను వారు విడుదల చేశారు. అనంతరం వీహెచ్ పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 9,600 స్థలాల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహిస్తారని చెప్పారు. భాగ్యనగర్ లో దాదాపు 3 లక్షల మంది యువకులతో రికార్డు స్థాయిలో భారీ ర్యాలీ కొనసాగుతుందని వెల్లడించారు.

కోఠి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో లక్ష మందితో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి రికార్డు సృష్టిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ స్వామీజీలతోపాటు బజరంగ్ దళ్ జాతీయ కన్వీనర్ నీరజ్ దునేరియా ముఖ్య అతిథులుగా హాజరవుతారని వివరించారు. భాగ్యనగరంలోని యువకులంతా ర్యాలీకి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. భాగ్యనగర్ మహానగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు 139 స్థలాల నుంచి బజరంగ్ దళ్ కార్యకర్తలు హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీకి తరలిరానున్నట్లు తెలిపారు. గౌలిగూడ రాముడి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహా ర్యాలీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయంకు చేరుకోవడంతో ఈ ర్యాలీ ముగుస్తుందన్నారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర సాగే ఈ ర్యాలీకి హిందూ యువకులు భారీ ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పల్లెల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు హిందూ శక్తి ప్రదర్శన ర్యాలీలను వైభవంగా నిర్వహిస్తారని వివరించారు. ఈ సమావేశంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మ ప్రసార్ రాష్ట్ర సహ ప్రముఖ్ సుభాష్ చందర్, వీహెచ్ పీ, బజరంగ్ దళ్ నాయకులు కమల్ వీరేష్, సాయం మహేష్ యాదవ్, అఖిల్, బిరాదర్ రాము, భరత్ వంశీ, సునీల్, రాము, ఉదయ్, రాంరెడ్డి, తిరుపతి, శ్రీను, భాను, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed