మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. 400 డ్రోన్లతో విరుచుకుపడిన కీవ్

by Ramesh Naini |

రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ ప్రతికార దాడులను తీవ్రతరం చేసింది.

మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. 400 డ్రోన్లతో విరుచుకుపడిన కీవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ ప్రతికార దాడులను తీవ్రతరం చేసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున ఒకేసారి 400 కంటే ఎక్కువ డ్రోన్లతో మాస్కోపై విరుచుకుపడింది. ఇటీవల ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఇతర నగరాలపై రష్యా జరిపిన తీవ్ర బాలిస్టిక్ క్షిపణి దాడులకు నిరసనగా ఉక్రెయిన్ ఈ చర్యకు దిగినట్లు అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది.

రష్యాలో దాడుల తీవ్రత

మాస్కో దిశగా వచ్చిన అత్యధిక డ్రోన్లను రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మాస్కో పరిసరాల్లో దాదాపు 85 డ్రోన్లను అడ్డుకున్నట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు. మాస్కో పరిసర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 10 మంది గాయపడినట్లు సమాచారం.

ఇంధన స్థావరాలపై దాడి

పడోల్స్క్‌లోని ఒక ఆయిల్ డిపోతో పాటు, మాస్కో సమీపంలోని ‘యుజ్నే వ్రాతా’ ఇండస్ట్రియల్ పార్క్‌లో తీవ్ర అగ్నిప్రమాదాలు సంభవించాయి. పలు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ వైమానిక రక్షణ లోపాలను అనుకూలంగా మార్చుకునేందుకు రష్యా ఇటీవల బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాన్ని గణనీయంగా పెంచింది. ఆదివారం రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలిసింది. ‘రష్యా నెలలో ఉత్పత్తి చేసే బాలిస్టిక్ క్షిపణుల కంటే ఎక్కువ మొత్తంలో ప్రస్తుతం ఉక్రెయిన్‌పై ఉపయోగిస్తోంది’ అని వాషింగ్టన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’ (ISW) వెల్లడించింది.

ఉక్రెయిన్‌లో అంతర్గత రాజకీయ సంక్షోభం

బహిరంగ పోరాటం ఒకవైపు నడుస్తుండగానే, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీసుకున్న కొన్ని సైనిక మార్పుల నిర్ణయాలు దేశంలో అంతర్గత నిరసనలకు దారితీశాయి. యువ నాయకుడు మైఖైలో ఫెడోరోవ్‌ను రక్షణ మంత్రి పదవి పరిశీలన నుంచి తప్పించి, పాత శైలి సైనిక అధికారి జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీని ఆర్మీ చీఫ్‌గా కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు జెలెన్స్కీ కీలక చర్చలు జరుపుతున్నారు.

Next Story