Potu Ranga Rao: మావోయిస్టుల శవాలను చూస్తే కూడా అంత భయమా?: పోటు రంగారావు

by Prasad Jukanti |   (  Updated:2025-05-26 08:54:15  IST  )

ఎన్ కౌంటర్ జరిగి ఆరు రోజులైనా ఇంకా మావోయిస్టు మృతదేహాలను అప్పగించకపోవడంపై పోటు రంగారావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Potu Ranga Rao: మావోయిస్టుల శవాలను చూస్తే కూడా అంత భయమా?: పోటు రంగారావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో (Chhattisgarh encounter) మృతి చెంది ఆరు రోజులైనా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు (Namballa Kesha Rao) సహా మిగతా మావోయిస్టుల శవాలను వారి బంధువులకు అప్పగించకపోవడం కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని కూటమి ప్రభుత్వ ఫాసిస్టు దుర్మార్గానికి నిదర్శనం అని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు (Potu Ranga Rao) విమర్శించారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు చచ్చిన శవాలతో కూడా యుద్ధం చేస్తున్నాయని, శవాలను చూస్తే కూడా అంత భయమా? అని ప్రశ్నించారు. ఇవాళ ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకనైనా మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్భంధం, బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల మావోయిస్టుల మృతదేహాల అప్పగింత ఆలస్యం వెనుక ఆనవాళ్లు, సాక్ష్యాలను కనిపించకుండా చేసే కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వాలు, పోలీసుల ఈ దుర్మార్గ వైఖరి చూస్తే మావోయిస్టులను పట్టుకువచ్చి కాల్చి చంపినట్లు వస్తున్న ఆరోపణలను విశ్వసించేలా ఉందన్నారు. సరిహద్దుల్లో చేసే యుద్ధం దండకారణ్యంలో చేస్తున్నారని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు విధానంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. దండకారణ్యంలో దొరికే విలువైన ఖనిజాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకే ఈ నరమేధం సృష్టిస్తూ రక్త పిపాసులుగా మారారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఈ నరమేధం ఆపి శాంతి చర్చలు జరపాలన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ నరమేధం ఆపి, ఎన్ కౌంటర్లపై, ఆదివాసుల మరణాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Next Story