హ్యామ్ రోడ్ల పునరుద్ధరణ: క్యాబినెట్‌లో కొత్త జాబితా, కొత్త ఆశలు

by Naga Rani Yarlagadda |

హ్యామ్ రోడ్ల ప్రతిపాదన మరోసారి క్యాబినెట్ ముందుకు వెళ్లనుంది. ఈ నెల 19న నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశంలో హ్యామ్ రోడ్లకు సంబంధించిన టెండర్లు ఖరారు చేయనున్నారు.

హ్యామ్ రోడ్ల పునరుద్ధరణ: క్యాబినెట్‌లో కొత్త జాబితా, కొత్త ఆశలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హ్యామ్ రోడ్ల ప్రతిపాదన మరోసారి క్యాబినెట్ ముందుకు వెళ్లనుంది. ఈ నెల 19న నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశంలో హ్యామ్ రోడ్లకు సంబంధించిన టెండర్లు ఖరారు చేయనున్నారు. ఇందుకోసం రోడ్డు భవనాల శాఖ అధికారులు నివేదికలను సిద్ధం చేశారు. దీనిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్లను నాలుగు వరసలకు విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఇలాంటి కొన్ని రోడ్ల నిర్మాణాన్ని మొదటి దశలో చేపట్టనున్న జాబితాలో చేర్చలేదు. అధికారులు మరోసారి ఇలాటి రోడ్లను పరిశీలించనున్నారు. కాగా జూన్ 23న క్యాబినెట్ ఆమోదించిన కొన్ని రోడ్ల పునరుద్ధరణపై పునరాలోచన చేసి, వాటి స్థానంలో వేరే రోడ్లను చేర్చినట్లు సమాచారం. మొదటి విడతలో 17 ప్యాకేజీల్లో 373 రోడ్లు, 5190.25 కిమీటర్ల పొడవు, దాదాపు రూ.6478.33 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఇటీవల కొందరు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు మరి కొన్ని రోడ్లను హ్యమ్ రోడ్ల జాబితాలో చేర్చినట్లు సమాచారం.

17 ప్యాకేజీల నుంచి 11 ప్యాకేజీలకు పరిమితం..?

మొదటి సారి క్యాబినెట్ 17 ప్యాకేజీలకు ఆమోదించింది. ఇప్పుడు 17 ప్యాకేజీలున్న పనులను 11 ప్యాకేజీలకు తగ్గించినట్లు సమాచారం. అంతే కాకుండా రోడ్ల సంఖ్య, కిలోమీటర్ల పొడవును కూడా పరిమితం చేసినట్లు తెలిసింది. కొత్తగా రూపొందించిన జాబితాలో నమోదు చేసిన రోడ్లను హ్యమ్ పద్దతిలో పునరుద్ధరించేందుకు క్యాబినెట్ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. మొదటి విడత హ్యమ్ రోడ్ల నిర్మాణాల్లో 16 జిల్లాల పరిధిలోని రోడ్లను పునరుద్దరణకు ఎంపిక చేశారు. అందులో నల్గొండ జిల్లాను రెండు సర్కిళ్లుగా విభజించి, 44 రోడ్లను జాబితాలో చేర్చారు. 537.78 కిలోమీటర్లు పొడవున రహదారులను పునరుద్దరించేందుకు సుమారు రూ.622 కోట్లు కేటాయించారు. కాగా ఈ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రాంతవాసి కావడంతో ఈ జిల్లా రోడ్లకు అధిక ప్రాధాన్యత కల్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యమ్ రోడ్ల జాబితాను సవరించినట్లు తెలుస్తోంది.

40:60 నిష్పత్తితో నిధులు

హ్యామ్ విధానంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణాల వ్యయాన్ని ప్రభుత్వం, గుత్తేదారులు 40:60 నిష్పత్తితో ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలో పునరుద్ధరించనున్న పలు రోడ్లకు 40 శాతం నిధులను ప్రభుత్వం కేటాయిస్తే, 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు సమకూర్చుకోవాలి. కాంట్రాక్టర్లు ఖర్చు చేసిన నిధులను ప్రభుత్వం వాయిదా పద్ధతిలో వడ్డీతో కలిపి చెల్లించనున్నది. 60 శాతం నిధులను బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలుగా ఇప్పించనున్నది.

Next Story