‘బిల్లుల చెల్లింపుల విషయంలో టెన్షన్ వద్దు’.. మంత్రి కోమటిరెడ్డి హామీ

by Gantepaka Srikanth |

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.11 వేల కోట్లతో హ్యామ్ రోడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

‘బిల్లుల చెల్లింపుల విషయంలో టెన్షన్ వద్దు’.. మంత్రి కోమటిరెడ్డి హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.11 వేల కోట్లతో హ్యామ్ రోడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మొత్తం 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. 2026 నూతన సంవత్సరంలో హ్యామ్ రోడ్ల పనులు మొదలు పెడుతామని స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపుల విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని, వచ్చే రెండేళ్లలో దేశానికే రోల్ మోడల్ రోడ్లు తెలంగాణలో నిర్మిస్తామని పేర్కొన్నారు. దేశంలో అద్దం లాంటి రోడ్లకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ నిలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. హ్యామ్ రోడ్ల నిర్మాణంలో, బిల్లుల చెల్లింపులో ఆర్ అండ్ బీ శాఖకు పూర్తి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోడ్ల నిర్మాణం పనులు జరిగేటప్పుడు వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత హెల్మెట్ ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ లాంటివి చేయొద్దని సూచించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రమాదం బారిన పడి, కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దు అన్నారు.

పెండింగ్ బిల్లులు మంజూరు

ఆర్ అండ్ బీ చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల మంజూరుకు మంత్రి కృషి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి మాట్లాడి రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల పేమెంట్ కు సంబంధించిన నిధులు మంజూరు చేయించారు. మిగతా రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న కాంట్రాక్టర్లకు మంత్రి భరోసా ఇచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,అందుకు కృషి చేసిన ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపారు.

Next Story