- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల బీభత్సం: తడిసిన ధాన్యం.. రైతన్న కంటనీరు
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం చేకూర్చుతోంది. ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వర్షం కురియగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయింది.

దిశ, వెబ్‌డెస్క్: అకాల వర్షాలు నిజామాబాద్ (Nizamabad) జిల్లాను కలవరపెడుతున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో పాటు పలుచోట్ల వడగళ్లు (Hailstones) పడటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ, మోపాల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా దాదాపు గంటకు పైగా వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. రాళ్ల వాన దెబ్బకు చేతికి వచ్చిన వరి పంట నేలపాలైంది.
పలుచోట్ల తడిసిన ధాన్యం..
అకాల వర్షం కారణంగా ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు నీటిపాలయ్యాయి. సరైన తార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం కొట్టుకుపోవడాన్ని చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల వరి చేనులు నెలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో వాన పడటంతో గింజ రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.






