- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిక్స్ ప్యాక్ కోసం జిమ్‌లో చిత్ర విచిత్రాలు
శరీర సౌష్టవం... సిక్స్ ప్యాక్ బాడీ... మజిల్స్ మెరిపించే లుక్ కోసం యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: శరీర సౌష్టవం... సిక్స్ ప్యాక్ బాడీ... మజిల్స్ మెరిపించే లుక్ కోసం యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిమ్‌లలో ఫిట్‌నెస్ పేరుతో హార్ట్ ఎటాక్ డ్రగ్స్ విక్రయాలు విరివిగా సాగుతున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిపై రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కఠిన చర్యలకు దిగింది. సికింద్రాబాద్ జోన్ డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఖార్ఖానా పోలీసులతో కలిసి నామాలగుండులో దాడి చేసి, రూ.లక్షల విలువైన మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.
నామాలగుండు లో దాడులు
డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని నామాలగుండు ప్రాంతంలోని ఎం. నరేష్ అనే వ్యక్తికి చెందిన లైసెన్స్ లేని ప్రాంగణంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో, జిమ్‌లకు వెళ్లేవారికి శరీర సౌష్టవం కోసం అక్రమంగా నిల్వ ఉంచిన 'టెర్మివా', 'టెర్మిన్' ఇంజెక్షన్ల వాయిల్స్ ను అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన వాటిలో 66 వాయిల్స్ మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఐపీ30 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఇంజెక్షన్లను నిందితుడు ఎం. నరేష్ ద్వారా బాడీ బిల్డర్లకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఏమిటి ఔషధం? దుర్వినియోగం ఎందుకు?
మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అనేది గుండె సంబంధిత ఉద్దీపన ఔషధం (కార్డియాక్ స్టిమ్యులెంట్). రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడం, గుండె బలహీనంగా కొట్టుకోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఔషధం ఇది. ఈ ఇంజెక్షన్ రక్త ప్రసరణను మెరుగుపరచి, గుండె పని చురుకుగా చేస్తుంది. దాంతో రక్తపోటు మళ్లీ సాధారణ స్థాయికి చేరుతుంది. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఇంజెక్షన్ వాడాలి. కొంతమంది బాడీబిల్డర్లు మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌లోని గుండె ఉద్దీపన గుణాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వ్యాయామ సమయంలో శారీరక సామర్థ్యం (ఎండ్యూరెన్స్) పెంచుకోవడానికి ఈ ఇంజెక్షన్‌ను వాడుతున్నట్లు సమాచారం. దాడుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ డి.సరిత, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు బి. గోవింద సింగ్, పి.రేణుక, జి.సురేంద్రనాథ్ పాల్గొన్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం...
మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను దుర్వినియోగం చేయడం వల్ల గుండె జబ్బులు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా ఈ ఔషధాలను నిల్వ ఉంచడం, విక్రయించడం డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టాన్ని ఉల్లంఘించడమే. నిందితులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.-డ్రగ్ కంట్రోల్ అథారిటీ డీజీ షానవాజ్ ఖాసీం






