- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Guvwala Balaraju: ఒంటరైన గువ్వల బాలరాజు! ఎక్కడో లెక్కతప్పిందా?
బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఒంటరయ్యారా?

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvwala Balaraju) ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌లో (BRS) యువ నాయకుడిగా పార్టీ బాస్ కేసీఆర్‌కు సన్నిహితుల్లో ఒకడిగా పేరున్న ఆయన అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. తన రాజకీయ ఎదుగుదలకు ఓనమాలు నేర్పిన బీఆర్ఎస్‌కే గుడ్ బై చెప్పేసిన బాలరాజు.. రేపో, ఎల్లుండో కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు పార్టీ మారుతున్న నేపథ్యంలో ఇన్నాళ్లు తన వెంట నడిచిన పార్టీ క్యాడర్ ఎటువైపు అనేది ఆసక్తిగా మారింది.
ఒకే ఒక్కడు:
బీఆర్ఎస్‌ను వీడటానికి గువ్వల అనేక కారణాలు చెబుతున్నప్పటికీ అత్యంత రహస్యంగా జరిగిన ఈ రాజీనామా తంతు బీఆర్ఎస్ శ్రేణులు, బాలరాజు అనుచరులను షాక్‌కు గురిచేసింది. రిజైన్ చేసిన తర్వాత కార్యకర్తలతో సమావేశమైన బాలరాజు ఎదుటనే పార్టీ మారొద్దంటూ కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు. మీకు దండం పెడతాము, కాళ్లు మొక్కుతాము పార్టీ మారొద్దంటూ వేడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయినా తన నిర్ణయం మార్చుకోని బాలరాజు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌తో సమావేశం కావడం, బీజేపీ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏకపక్ష నిర్ణయాలపై క్యాడర్ ఆగ్రహంతో ఉంది. కాగా, ఇన్నాళ్లు బాలరాజు వెంట నడిచిన వారంతా మీ వెంట మేము వచ్చేది లేదంటూ స్పష్టం చేశారు. గువ్వల బాలరాజు పార్టీ మార్పు తినే అన్నాన్ని కాలితో తన్నడం లాంటిదని, తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే గుద్దడం అంటూ ఆయన క్యాడర్ మండిపడుతుంది. మండల స్థాయి లీడర్లు సైతం ఆయన వెంట నడిచేందుకు ససేమీరా అంటున్నట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లాలని భావిస్తున్న గువ్వల ప్రస్తుతం ఒంటరిగా మారిపోయారనే టాక్ వినిపిస్తోంది.
బీజేపీలోను సందేహాలు?
గువ్వల రాకలో బీజేపీ (BJP) రాష్ట్ర నాయకత్వంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ కేసులో పార్టీని ఇబ్బంది పెట్టే ఆపరేషన్‌లో కీలక భాగస్వామ్యం వహించిన బాలరాజును తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా పార్టీకి మేలు కంటే నష్టమే ఎక్కువ అని కొంత మంది లీడర్లు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్లు టాక్. గతంలో బీజేపీ కార్యకర్తలపై బాలరాజు ఫోన్ కాల్ బూతులు మాట్లాడిన తీరు ఎవరు మర్చిపోలేదని, ఆయన హిస్టరీ అంతా క్లీన్ ఏమి కాదనే చర్చ నడుస్తోంది. కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న గువ్వల బాలరాజు అకస్మాత్తుగా బీజేపీలోకి ఎంట్రీ ఇస్తే క్షేత్రస్థాయిలో ఎలాంటి సంకేతాలు వెళ్తాయనేది కమలం పార్టీలోనూ చర్చనీయాశంగా మారింది.






