రైతులకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి: గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణలో రైతుల సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రైతులకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి: గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రైతుల సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులకు అందుతున్న పథకాల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతు భరోసాతో పాటు పంటలకు బోనస్‌ను కూడా అందిస్తోంది. అయితే, ఇలా మల్టిపుల్ (బహుళ) విధానాల ద్వారా నిధులు వెచ్చించడం వల్ల ప్రభుత్వంపై మోయలేని ఆర్థిక భారం పడుతోందని గుత్తా పేర్కొన్నారు. కేవలం పంటల బోనస్‌ కోసమే ప్రభుత్వం సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. రైతు భరోసా నిధులు సంపూర్ణంగా అందలేదన్న అసంతృప్తి రైతుల్లో బలంగా ఉంది. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు పథకాల అమలులో జాప్యం వల్ల ఆశించిన ఫలితం రావడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.

స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని సూచన..

ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు. రైతు భరోసా లేదా పంటల బోనస్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకుని, దానిని రైతులకు పూర్తిగా అందజేయాలి. ఏదో ఒక పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది. రైతులను సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వం వీలైనంత త్వరగా ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పెద్దలు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో మరియు రాబోయే రోజుల్లో రైతు పథకాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.

Next Story