కార్పొరేట్ విద్యకు దీటుగా గురుకులాలు.. మంత్రి అడ్లూరి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

విద్యను ఖర్చుగా కాకుండా భవిష్యత్ తరాలపై చేసే విలువైన పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

కార్పొరేట్ విద్యకు దీటుగా గురుకులాలు.. మంత్రి అడ్లూరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యను ఖర్చుగా కాకుండా భవిష్యత్ తరాలపై చేసే విలువైన పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ప్రగతికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో శనివారం నిర్వహించిన 'అకాడమిక్ సక్సెస్ మీట్-2026'లో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ గిరిజన గురుకులాలు కార్పొరేట్ సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని ప్రశంసించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 98.86 శాతం, ఇంటర్‌లో 86.53 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. ధర్మపురిలో గిరిజన బాలికల కోసం 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు సైనిక్ స్కూల్, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే ఆమోదం లభిస్తుందని తెలిపారు.

గురుకులాల మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.72.83 కోట్లు, ఆధునిక మాడ్యులర్ కిచెన్ల కోసం రూ.25 కోట్లు కేటాయించామని, అన్ని సంస్థలకు 'ఈట్ రైట్' సర్టిఫికేషన్ లభించిందని మంత్రి తెలిపారు. పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.565.32 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను సత్కరించి, నగదు పురస్కారాలు, మెమెంటోలు అందజేశారు.

Next Story