ఈఏపీసెట్ 2026లో గురుకులాల సత్తా.. అగ్రికల్చర్, మెడిసిన్‌లో సరికొత్త రికార్డు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-17 15:28:13  IST  )

ఈఏపీసెట్-2026 ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (TGSWREIS) విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.

ఈఏపీసెట్ 2026లో గురుకులాల సత్తా.. అగ్రికల్చర్, మెడిసిన్‌లో సరికొత్త రికార్డు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (TGSWREIS) గురుకుల విద్యార్థులు ఈఏపీసెట్–2026 ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు తెలిపారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) విద్యార్థులు వ్యవసాయం, మెడిసిన్ విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి గురుకులాల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ.. పేద, దళిత, గిరిజన, బడుగు వర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచి, తెలంగాణ గురుకులాల్లో ఒక నూతన విద్యా విప్లవానికి నాంది పలికారని చెప్పేందుకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించిందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక వసతులు, ప్రత్యేక కోచింగ్, డిజిటల్ లెర్నింగ్, పోటీ పరీక్షల శిక్షణ వంటి అనేక కార్యక్రమాల అమలుకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ విజయాల వెనుక తల్లిదండ్రుల త్యాగం, విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల నిరంతర కృషి ప్రధాన కారణాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, జేఈఈ, నీట్, ఈఏపీసెట్ వంటి ప్రధాన పరీక్షల్లో గురుకుల విద్యార్థులు వరుస విజయాలు నమోదు చేయడం సంస్థ విద్యా నాణ్యతకు నిదర్శనమన్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి వారికి లక్ష్యాధారిత శిక్షణ అందించేందుకు అకాడమిక్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేసినట్లు ఆమె తెలిపారు. రెగ్యులర్ గ్రాండ్ టెస్టులు, డైలీ ప్రాక్టీస్ సెషన్లు, ప్రత్యేక స్టడీ అవర్స్, సబ్జెక్ట్‌ వైజ్ మెంటరింగ్, సందేహ నివృత్తి తరగతులు, నిపుణులతో ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.

ప్రత్యేకించి బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అధ్యాపకులు విద్యార్థుల విజయాల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు అంకితభావంతో పనిచేశారని ఆమె కొనియాడారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా విద్యార్థులకు మానసిక ధైర్యం, ప్రేరణ అందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని కంభంపాటి శారద పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, ప్రిన్సిపాళ్లు, అకాడమిక్ బృందాలకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా గురుకుల సంస్థ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

Next Story