కదనరంగంలోకి గులాబీ బాస్.. జూబ్లీహిల్స్ బై‌పోల్‌పై KTR, హరీశ్‌లతో భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-23 05:36:39  IST  )

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో కీలక భేటీ నిర్వహించారు.

కదనరంగంలోకి గులాబీ బాస్.. జూబ్లీహిల్స్ బై‌పోల్‌పై KTR, హరీశ్‌లతో భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. బుధవారం ఉదయమే కేటీఆర్, హరీశ్‌రావు ఫాంహౌస్ కు చేరుకోగా, ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మీదనే చర్చించనట్లు తెలిసింది. సిట్టింగ్ స్థానాన్ని వదులుకోకూడదని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల వ్యూహరచనపై దృష్టిసారించినట్లు సమాచారం. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్ షోలు ప్లాన్ చేయాలని సూచించినట్లు తెలిసింది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ప్రచారంపైనా దృష్టిపెట్టాలని దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపైనా చర్చించినట్లు సమాచారం.

నేడు ఇంచార్జీలతో భేటీ

జూబ్లీహిల్స్‌పై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ అయిన అధినేత.. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్‌చార్జీలతో సమావేశమవుతారని తెలిసింది. ప్రచారంపై వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ప్రచారంలో ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి.. వ్యూహాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలపై వారితో చర్చించనున్నట్లు తెలిసింది. అంతే కాకుండా నియోజకవర్గంలో ఒకరోజు భారీ బైక్ ర్యాలీకి సైతం ప్లాన్ చేయనున్నట్లు సమాచారం.

నేటి నుంచి హైదరాబాద్‌లోనే కేసీఆర్?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నా.. పాల్గొనకపోయినా ఇక నుంచి కేసీఆర్ అందరికీ అందుబాటులో ఉండాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈనెల 23 నుంచి హైదరాబాద్‌ నందినగర్‌లోని తన నివాసంలోనే ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారని సమాచారం. ఇక్కడి నుంచే జూబ్లీహిల్స్ ఎన్నికను పర్యవేక్షిస్తారని పార్టీవర్గాల ద్వారా తెలిసింది. గురువారం ఉదయం తన ఎర్రవల్లి ఫాంహౌస్ లోనే నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమావేశం అనంతరం వారితో పాటే కేసీఆర్ హైదరాబాద్ కు పయనమవుతారని సమాచారం.

READ MORE ...

నేడు మరోసారి కీలక నేతలతో కేసీఆర్ భేటీ!


Next Story