- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్లోజుల వైపే దండకారణ్యం..?
సాయుధ పోరాట విరమణ పంథాకు మావోయిస్టు కేడర్లలో పెరుగుతున్న మద్దతు

దిశ, తెలంగాణ బ్యూరో: సాయుధ పోరాటానికి స్వస్తి చెబుతామంటున్న మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్@సోనూ@మల్లోజుల వేణుగోపాల్‌కు పార్టీ కేడర్ల నుంచి మద్దతు పెరుగుతున్నదా?, దండకారణ్యం(డీకే)లోని విప్లవకారుల్లో మెజారిటీ ఆయన వైపే ఉండడానికి నిర్ణయించుకున్నారా?, ఆయన రాసిన 22 పేజీల లేఖలోని అంశాలతో చాలా మంది ఏకీభవిస్తున్నారా?, తన పంథాను సమర్థించే కార్యకర్తలందరితో కలిసి త్వరలోనే ఆయన జనజీవన స్రవంతిలో కలువబోతున్నారా?, తాము నమ్మిన సిద్ధాంతాన్ని చట్టబద్ధ పద్ధతుల్లో అమలు చేయబోతున్నారా?, మావోయిస్టు పార్టీ నిట్టనిలువునా చీలబోతున్నదా?, ఇలాంటి ప్రశ్నలకు విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వెలువడుతున్నది. ఇరు పక్షాల నుంచీ లేఖల పరంపర ఇంకా కొనసాగుతుండగానే గత వారం, పది రోజుల్లో దండకారణ్యానికి చెందిన గడ్చిరోలి, ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్ల నుంచి సోనూ పంథాను సమర్థిస్తూ లేఖలు వెలువడడాన్ని వాళ్లు ఉదహరిస్తున్నారు. ఈ డివిజన్లు కాకుండా ఇక డీకేలో మిగిలి ఉన్నవి కేవలం దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్, దర్బా డివిజన్లేనని వాళ్లంటున్నారు. అక్కడ సైతం సోనూ పంథాపై చర్చ జరుగుతున్నదని, ఆ కమిటీలు కూడా త్వరలోనే ఆయనకు మద్దతు ప్రకటిస్తాయనే సమాచారముందని చెబుతున్నారు. గడ్చిరోలి ప్రకటనలో ఆ డివిజనల్ కమిటీ అధికార ప్రతినిధి కలమ్‌సాయ్ వేలాది పేరే కాకుండా పార్టీ టెక్నికల్ విభాగం ఇన్చార్జి మైనూ, కంపెనీ-10 కమాండర్ నిఖిల్ పేర్లు ఉండడాన్ని ఉదహరిస్తున్నారు.
గడ్చిరోలితో సోనూకు సుదీర్ఘ అనుబంధం..
సోనూ@మల్లోజుల వేణుగోపాల్ తన ఉద్యమ ప్రస్థానాన్ని గడ్చిరోలి నుంచే ప్రారంభించారని, డివిజన్ కమిటీ సభ్యుడుగా, కార్యదర్శిగా చాలాకాలం పనిచేసిన తర్వాతే డీకేఎస్‌జడ్సీలోకి వచ్చి, తర్వాత కార్యదర్శిగా, సీసీ సభ్యునిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారని విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంగా గడ్చిరోలి డివిజన్, పశ్చిమ సబ్ జోన్ కేడర్ వందశాతం ఆయనతోనే ఉంటారని వాదిస్తున్నారు. ఇక మాడ్, ఉత్తర బస్తర్ డివిజన్ల పార్టీ శ్రేణులకు కూడా ఆయన చిర పరిచయం కావడంతో పాటు నార్త్ సబ్ జోనల్ బ్యూరో ఇన్చార్జి రూపేశ్@తక్కళ్లపల్లి వాసుదేవరావు@ఆశన్న కూడా సోనూతో ఉండడం కలిసి వచ్చిందని అంటున్నారు. రూపేశ్ గతంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంతి చర్చల గురించి, పార్టీ పాలసీ గురించి పరోక్షంగా సోనూకు మద్దతుగా మాట్లాడిన విషయాన్ని వాళ్లు ఉదహరిస్తున్నారు.
దక్షిణ, పశ్చిమ బస్తర్‌లపై సుజాతక్క ప్రభావం..
ఇటీవల తెలంగాణ డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిన సుజాతక్క@మైనక్క@పోతుల పద్మావతి సోనూకు స్వయానా సోదరుడైన దివంగత మల్లోజుల కోటేశ్వర్‌రావు@కిషన్‌జీకి సతీమణి కావడం గమనార్హమని విశ్లేషకులు అంటున్నారు. సోనూకు సమాచారమిచ్చే ఆమె బయటకు వచ్చారా? లేక సొంత నిర్ణయమా? అన్న విషయం తెలియకపోయినా ఆమె సాయుధ పోరాట పంథాను వీడిందన్నది ఇక్కడ ముదావహమని వాళ్లంటున్నారు. ఆమెకు దక్షిణ, పశ్చిమ బస్తర్ ఉద్యమాలతో సుదీర్ఘ అనుబంధముందని, అక్కడి కేడర్లు ఆమెకు సన్నిహితులని వివరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దక్షిణ, పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీలు కూడా సోనూ పంథాను అనివార్యంగా సమర్థిస్తాయని, రేపో, మాపో ప్రకటనలు వెలువడవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే మెజారిటీ దండకారణ్య మావోయిస్టు కేడర్ సోనూ వెంటే ఉన్నట్టవుతుందని వివరిస్తున్నారు.
మల్లోజులకు వ్యతిరేకంగా తెలంగాణ?
కాగా, సీసీ సభ్యులు దేవ్‌జీ@తిప్పిరి తిరుపతి, చంద్రన్న@పుల్లూరి ప్రసాదరావు సహా పలువురు తెలంగాణ నేతలు సోనూ పంథాను వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. ఇన్ని విజయాల తర్వాత సాయుధ పోరాట విరమణ అంటే అది నయా రివిజనిజమేనని, ప్రజలకు ద్రోహం చేయడమేననే అభిప్రాయంతో వాళ్లు ఉన్నారని అంటున్నారు. ఫస్ట్ బెటాలియన్ కమాండర్, ఆదివాసీ నేత హిడ్మా వైఖరి ఇంకా వెలుగులోకి రాలేదని, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బిహార్ తదితర రాష్ట్రాలు ఏ పంథా వైపు ఉన్నాయో కూడా స్పష్టత లేదని అంటున్నారు. సీనియర్ సీసీ సభ్యులు గణపతి@ముప్పాళ లక్ష్మణ్‌రావు, సంగ్రామ్@మల్లా రాజిరెడ్డి ఎక్కడ ఉన్నారు? వారి వైఖరి ఏమిటనేది కూడా తెలియ రావడం లేదంటున్నారు.
జనజీవన స్రవంతిలోకి అసమ్మతి వర్గం?
సోనూ పంథాను సమర్థించే పార్టీ కేడర్లందరూ ఒక్కసారిగా లేదా వేర్వేరుగా బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తారా? అన్న విషయంపై కూడా పరిశీలకుల్లో చర్చ ఉంది. తెలంగాణ డీజీపీ ఎదుట సోనూ లొంగిపోయాడన్న వార్తలు కూడా ఆ మధ్య వెలువడిన విషయం తెలిసిందే. దానిని పోలీసు వర్గాలు ఖండించాయి. అయితే సోనూ, మరికొందరు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారని, త్వరలోనే జనజీవన స్రవంతిలో కలిసే కార్యక్రమం జరుగుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మరోవైపు, గడ్చిరోలికి చెందిన సీనియర్ నేత సహా అనేక మంది మావోయిస్టులు త్వరలో లొంగిపోనున్నారని ఆగస్టులో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించినట్టు, సోనూ@వేణుగోపాల్‌ను ఉద్దేశించే ఆయన ఆ మాటలు అన్నట్టు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. సోనూ వర్గం ఆయుధాలు వదిలి బయటకు రానుందనే ప్రచారంపై ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ మంగళవారం స్పందిస్తూ.. అలా వచ్చిన వాళ్లకు తాము రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతామని ప్రకటించడం గమనార్హం.






