బీసీ సంఘాల నేతలతో మంత్రుల బృందం సమావేశం

by M.Rajitha |
బీసీ సంఘాల నేతలతో మంత్రుల బృందం సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కులగణన నివేదికపై బీసీ సంఘాలు, మేధావులతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ కుల సర్వే సమాచారం రాష్ట్రంలో ఉందని బీసీ సంఘాలు, బీసీ మేధావులు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సమావేశంలో కులగణన సర్వే పై బీసీ సంఘాలు, మేధావులకు ఉన్న అనుమానాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... గతేడాది ఫిబ్రవరి 2024 న క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని అదే నెల 16వ తేదీన శాసనసభలో బీసీ కులగనుల పైన తీర్మానం చేసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తర్వాత పార్లమెంటు ఎన్నికల కారణంగా ఆలస్యమైందని వెల్లడించారు.

ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించిందని తెలిపారు. బీసీ కమిషన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి సమగ్ర సర్వే పనులను అప్పగించామన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల గణన పూర్తి చేసిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తి గోరంతను కొండంత చేస్తూ కుల సర్వేను తప్పుపడుతున్న తరుణంలో బీసీ సంఘాలు , మేధావులు , ఫ్రొఫెసర్ల తో సమావేశాన్ని ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. బీసీ కుల గణన ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడానికి ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చిన తీసుకుంటామని మంత్రి తెలిపారు.

పలు బీసీ సంఘాలు నేతలు ఇచ్చిన సూచనలు స్థానిక సంస్థల ఎన్నికలు తదితర రాజకీయ రిజర్వేషన్లు , బీసీ ఎంపవర్మెంట్, బీసీ డిక్లరేషన్ అమలు వారి సలహాలు సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికీ తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తామని బీసీ ల సామాజిక న్యాయం జరగడానికి తమ ప్రభుత్వం పార్టీ కట్టుబడి ఉంటుందని బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ ప్రభుత్వం ఓపెన్ గా సలహాలు సూచనలు స్వీకరిస్తుందని ఇందులో ఎలాంటి దాపరికాలు ,విమర్శలు లేవన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ,10 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ బీసీ లను అణగదొక్కి సామాజిక న్యాయం చేయలేదని, ఈ మహత్తర కార్యక్రమాన్ని మా ప్రభుత్వం పారదర్శకంగా చేస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపి సురేష్ షెట్కర్ ,ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ , కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ కమీషన్ చైర్మన్ నిరంజన్ , బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్‌ ,తిరుమలగిరి సురేందర్‌ ,బాలలక్ష్మి, వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు నూతి శ్రీకాంత్ గౌడ్ , జ్ఞానేశ్వర్, ఈరవత్రి అనిల్, మెట్టు సాయి కుమార్, జైపాల్, వినయ్ కుమార్, బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య , జాజుల శ్రీనివాస్ గౌడ్ , మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణమూర్తి , మాజీ ఐఏఎస్ చిరంజీవులు ,మురళి మనోహర్, తాడురీ శ్రీనివాస్ , బాలరాజు గౌడ్, దాసు సురేష్ శ్రీనివాస్ పలువురు బీసీ సంఘం నేతలు ,ఫ్రొఫెసర్లు పాల్గొన్నారు.

Next Story