RRR సౌత్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్.. 201 కి.మీ రోడ్డు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

by Kema Shiva Kumar |

రీజినల్ రింగ్ రోడ్ సౌత్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

RRR సౌత్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్.. 201 కి.మీ రోడ్డు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రీజినల్ రింగ్ రోడ్ సౌత్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చౌటుప్పల్‌లో ఏర్పాటు చేయనున్న ట్రిపుల్ ఆర్ నార్త్ కారిడార్ నుంచి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, ఆమన్‌గల్ మీదుగా ఇన్నర్, అవుట్ జంక్షన్ (సర్కిల్) వరకు దాదాపు 201 కి.మీ రహదారి మార్గాన్ని నిర్మించేందుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని నిర్మాణానికి 2,010 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. రూ.18 వేల కోట్లతో 189.5 కి.మీ మేర ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం నిర్మించాలని మొదట ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే అనుమతులు లేకపోవడంతో రహదారి అలైన్ మెంట్, భూసేకరణ పనులు నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టుకు సోమవారం కేబినెట్ ఆమోందిచడంతో పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది.

అలైన్‌మెంట్‌లో మార్పులు..

చౌటుప్పల్‌లో ఏర్పాటు చేయనున్న ఉత్తర భాగం ట్రిపుల్ ఆర్ సర్కిల్ నుంచి తలకొండపల్లి, ఆమన్‌గల్, షాబాద్, కొందుర్గు, పూడూర్, నవాబుపేట, కొండాపూర్, సదాశివపేట మండలం పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఇన్నర్, అవుట్ జంక్షన్ (సర్కిల్) వరకు దాదాపు 189.5 కి.మీ రహదారి మార్గాన్ని నిర్మించేందుకు మొదట ప్రతిపాదించారు. పూడూర్ మండలం కౌకుంట్ల, అంగడ్ చిట్టెంపల్లి , రేగడి మామిడిపల్లి గ్రామాల మీదుగా ప్రపోజ్ చేశారు. కొందుర్గు మండలం రాంచంద్రాపురం, రేగడిచిలకమర్రి, బైరంపల్లి మీదుగా ఇది ఉండేది. తాజాగా, మాడ్గుల మండలం నల్ల చెరువు, కుర్మేడు, ఆమన్ గల్ మండలం చింతలపల్లి, మేడిగడ్డతండా, పోలెపల్లి, తలకొండపల్లి మండలం కానాపూర్, షాబాద్ మండలం మీదుగా కొందుర్గు మండలంలోని వనంపల్లి, లాల్ పహాడ్, తుర్కఎన్కెపల్లి, పూడూర్ మండలం కంకల్, పెద్ద ఉమ్మెంతల, కొత్తపల్లి, మీర్జాపూర్, వికారాబాద్ మండలం సిద్దులూరు, నవాబుపేట మండలం పూలపల్లి, పుల్‌మామిడి, ఎల్కకొండ, కొండాపూర్, సదాశిపేట మండలాల మీదుగా పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఇన్నర్, అవుట్ జంక్షన్(సర్కిల్) వరకు నిర్మించనున్నారు.

189 కి.మీ నుంచి 201 కి.మీ పెంపు

బీఆర్ఎస్ హయాంలో ట్రిపుల్ ఆర్ దక్షిణభాగాన్ని 189.5 కి.మీ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. అయితే అలైన్ మెంట్ లో కొన్ని మార్పులు చేయడంతో ఈ రహదారి 201 కి.మీ పెరిగిందని అధికారులు తెలిపారు. చౌటుప్పల్ సర్కిల్ నుంచి మొదలు పెట్టనున్న ఈ రహదారి మొదట్లో మాల్ లోపలి నుంచి ప్రతిపాదించారు. అనంతరం ప్రభుత్వ సూచనల మేరకు పాత అలైన్ మెంట్ ను సవరించినట్లు సమాచారం. అలాగే కొందుర్గు మండలంలో కూడా పాత అలైన్ మెంట్ ను మార్చి, కొత్తగా ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. కొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన సూచనల మేరకు ఈ రహదారిని సవరించినట్లు చర్చ జరుగుతున్నది. దీంతో మాడ్గుల, తలకొండపల్లి, పూడూర్ మండలాల్లో చేపట్టిన మార్పులతో దాదాపు 20 కి.మీ పొడవు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

అటవీ భూములు లేకపోవడంతో..

దక్షిణ భాగం ట్రిపుల్ ఆర్ కు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ రహదారి నిర్మాణానికి సంబంధించిన అలైన్ మెంట్, రోడ్డు మార్కింగ్, భూసేకరణ తదితర పనులను ఇక మొదలు పెట్టనున్నారు. తాజాగా ప్రతిపాదించిన మార్గంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, కొన్ని నిర్మాణాలు మాత్రమే పోతున్నాయి. ముఖ్యంగా దక్షిణభాగం ట్రిపుల్ ఆర్ కు అటవీ భూముల అడ్డంకులు లేకపోవడంతో దీని నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, భూసేకరణ సులభంగా జరిగి, పనులు వేగవంతం చేసేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Next Story