RTC Board: తెలంగాణలో కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

by Gantepaka Srikanth |

తెలంగాణలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు తెలంగాణ ఆర్టీసీ బోర్డు(Telangana RTC Board) అనుమతి ఇచ్చింది.

RTC Board: తెలంగాణలో కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు తెలంగాణ ఆర్టీసీ బోర్డు(Telangana RTC Board) అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశమైంది. కొత్త డిపోలు, బస్ స్టేషన్‌లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుతో పాటు ప్రస్తుతమున్న 97 డిపోలు & బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని.. అందుకు అనుగుణంగా కొత్త బస్ స్టేషన్ల నిర్మాణంతో పాటు ఉన్నవాటిని విస్తరిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు కొత్త బస్సులను కొనుగోలు చేస్తూనే.. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. బోర్డు అనుమతి లభించిన నూతన డిపోలు, బస్ స్టేషన్లను త్వరతిగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

1. పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లిలో కొత్త బస్ డిపో కోసం నిర్మాణం కోసం రూ.11.70 కోట్లు కేటాయింపు

2. ములుగు జిల్లా: ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం రూ.6.28 కోట్లు కేటాయింపు

3. ములుగు జిల్లా: ములుగు లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.5.11 కోట్లు కేటాయింపు

4. సూర్యాపేట జిల్లా: హుజూర్‌నగర్‌లో కొత్త బస్ స్టేషన్ కోసం రూ.3.75 కోట్లు కేటాయింపు

5.ఖమ్మం జిల్లా: మధిరలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.10.00 కోట్లు కేటాయింపు

6. ములుగు జిల్లా: మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి రూ.51.00 లక్షలు కేటాయింపు

7., పెద్దపల్లి జిల్లా: మంథని బస్ స్టేషన్ విస్తరణ కోసం రూ.95.00 లక్షలు కేటాయింపు

8. సూర్యాపేట జిల్లా: కోదాడ వద్ద ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.17.95 కోట్లు కేటాయింపు

9. భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రాబోయే “సరస్వతి పుష్కరాల” దృష్ట్యా ఆధునిక బస్ స్టేషన్‌ నిర్మాణానికి రూ.3.95 కోట్లు కేటాయిస్తూ ఆర్టీసీ బోర్డు అనుమతులు ఇచ్చింది.

Next Story